Gautam Gambhir criticizes team india and pakistan: 2011 వరల్డ్ కప్ ఫైనల్ హీరో, టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(Gautham gambhir) ఏం మాట్లాడినా ముక్కుసూటిగా మాట్లాడుతాడు. ఎవరు ఏం అనుకున్నా నలుగురు తిట్టుకున్నా ముగ్గురు మెచ్చుకున్నా అదంతా అతనికి అనవసరం. చెప్పాలనుకున్నది చెప్పేస్తాడంతే. ఈ నైజం వల్ల గంభీర్‌ని సోషల్‌మీడియాలో ట్రోల్ చేసేవారి సంఖ్యనే ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కోహ్లీ అభిమానులకు గంభీర్ అంటే కోపం. అతను ఏం మాట్లాడినా అందులో కోహ్లీనే టార్గెట్ చేసేలాగా ఉంటుందన్నది వాళ్ల వాదన. ఇక ప్రస్తుతం ఆసియా కప్ టోర్ని జరుగుతుండగా.. ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ ఆడింది ఇండియా. పాకిస్థాన్‌పై జరిగిన ఆ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ మ్యాచ్‌లో మైదానం లోపల టీమిండియా-పాక్ ఆటగాళ్లు చాలా ఫ్రెండ్లీగా కనిపించారు. దీన్ని గంభీర్ తప్పుపట్టాడు.
గంభీర్ ఏం అన్నాడంటే:
'జాతీయ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నప్పుడు మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకూడదు. ప్రత్యర్థి ఆటగాళ్లతో స్నేహాన్ని మైదానం బయటే వదిలేయాలి. ఆ తర్వాతే గ్రౌండ్‌లో అడుగుపెట్టాలి. ఇరు జట్ల ఆటగాళ్ల కళ్లలో దూకుడు ఉండాలి. 6-7 గంటల క్రికెట్ తర్వాత మీరు కోరుకున్నంత ఫ్రెండ్లీగా ఉండొచ్చు' అని గంభీర్ వ్యాఖ్యలు చేశాడు.
గంభీర్ వర్సెస్ కోహ్లీ ఫ్యాన్స్:
గంభీర్ వ్యాఖ్యలను కోహ్లీ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. గ్రౌండ్‌లో తన్నుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు గంభీర్ చెప్పినదాన్ని క్లియర్‌గా అర్థం చేసుకోకుండా అతడిని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు అంటున్నారు. నిజానికి గంభీర్ గ్రౌండ్ బయట, మ్యాచ్ ముగిసిన తర్వాత సరదాగా ఉండడంలో తప్పెం లేదని చెప్పాడు. గేమ్ టైమ్‌లో ఇలా ఫ్రెండ్లీగా ఉండడం వల్ల గెలవాలన్న సీరియస్‌నెస్ మిస్ అవుతుందన్నాడు. "మ్యాచ్ జరుగుతున్న సమయం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మీరు మీకు మాత్రమే ప్రాతినిధ్యం వహించడం లేదు, మీరు 100 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రోజుల్లో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు ఫ్రెండ్లిగా ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం ఇలా ఉండేవారు కాదు. ఆప్ ఫ్రెండ్లీ మ్యాచ్ హి ఖేల్ రహే హో' అని వ్యాఖ్యానించాడు. ఇక మ్యాచ్‌కి ముందు మ్యాచ్ ముగిసిన తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఉండొచ్చన్నాడు. ఇక ఇవాళ జరగనున్న ఇండియా వర్సెస్ నేపాల్ మ్యాచ్ కూడా రద్దయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి. పల్లెకెలేలో 80శాతం వర్షం పడే అవకాశాలున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.
ALSO READ: మరోసారి వర్షం గండం.. నేపాల్‌తో టీమిండియా ఢీ..బుమ్రా అవుట్!