Work From Jail: జైలు నుంచే కేజ్రీవాల్ సీఎంగా పనిచేయవచ్చా? చట్టాలు ఏం చెబుతున్నాయి?

కేజ్రీవాల్‌ జైలు నుంచి రూల్‌ చేయడమే కాదు ఏకంగా ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన కొనసాగించవచ్చా? రాజ్యాంగం మాటేంటి? చట్టాలు ఏం చెబుతున్నాయి? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌లోకి వెళ్లండి.

New Update
CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?

Arvind Kejriwal: స్వాతంత్ర్య భారతంలో సీఎం పదవిలో ఉండగా అరెస్టైన తొలి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌. గతంలో అనేకమంది సీఎంలు అవినీతి కేసుల్లో అరెస్టైనా వారంతా తమ పదవికి రాజీనామా చేసిన తర్వాత జైలుకు వెళ్లారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో మరికొందరు మాజీ సీఎంలు జైలుకు వెళ్లారు. కానీ కేజ్రీవాల్‌ సీఎంగా ఉండగానే ఈడీ (ED) ఆయన్ను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేస్తారని అంతా భావించారు. అయితే ఆమ్‌ ఆద్మి పార్టీ (Aam Aadmi Party) మాత్రం కేజ్రీవాల్‌ జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తారని తేల్చి చెప్పింది. ఇలా కేజ్రీవాల్‌ జైలు నుంచి రూల్‌ చేయడమే కాదు ఏకంగా ఆదేశాలు కూడా జారీ చేస్తున్నారు. ఇప్పటికీ ఢిల్లీ ఆరోగ్యశాఖకు సంబంధించిన ఉత్తర్వులిచ్చారు కేజ్రీవాల్. ఇలా ఈడీ కస్టడీ నుంచే ఆదేశాలు ఇవ్వడం రెండోసారి. మొదటిసారి కేజ్రీవాల్ నీటి సమస్య నివారణ కోసం ఆప్ మంత్రి అతిషికి నోట్‌ ద్వారా ఉత్తర్వులిచ్చారు. ఇలా ఉత్తర్వలివ్వడంపై ఈడీ సీరియస్‌గా ఉంది. కేజ్రీవాల్ ఇలా చేయడాన్ని ఈడీ ఒప్పుకోవడం లేదు. అయితే చట్టాలు ఏం చెబుతున్నాయి? కేజ్రీవాల్ జైలు నుంచి పరిపాలన కొనసాగించవచ్చా? సీఎంగా పనిచేయవచ్చా? రాజ్యాంగం మాటేంటి?

దోషిగా తేలలేదుగా:
అరెస్టు తర్వాత కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని జైలు నుంచే విధులు నిర్వహిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ చెబుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన జైల్లోనే ఉండి సాధారణ పద్ధతిలో ప్రభుత్వాన్ని నడపగలరా అనేది పెద్ద ప్రశ్న. అయితే దోషిగా తేలే వరకు కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951 అనర్హత నిబంధనలను వివరిస్తుంది. పదవి నుంచి తొలగించడానికి శిక్ష అవసరం. ప్రస్తుత సీఎంకు రాజీనామా నైతిక ఎంపిక కావచ్చు. అంతేకాకుండా జైలు మాన్యువల్ ప్రకారం కేబినెట్ సమావేశాలు నిర్వహించడం, కోర్టు అనుమతితో ఫైళ్లపై సంతకాలు చేయడం లాంటి కొన్ని అనుమతులతో సీఎం జైలు నుంచే పాలన సాగించవచ్చు. అయితే ఇది అంత సులభం కాదు.

అంత ఈజీ కాదు.. ఎందుకంటే?
జైలు మాన్యువల్ ప్రకారం ఖైదీని వారానికి రెండుసార్లు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు లేదా మరెవరితోనైనా కలవవచ్చు. ప్రతి సమావేశం అరగంట పాటు సాగుతుంది. ఇందుకోసం ముందుగానే జైలు యంత్రాంగానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ఒక ప్రదేశాన్ని జైలుగా ప్రకటించవచ్చు. అంటే ఓ ఇంటిని కూడా జైలుగా ప్రకటించవచ్చు. గృహ నిర్బంధమే ఇందుకు ఉదాహరణ. ఒక భవనం లేదా భవనాన్ని జైలుగా ప్రకటించే అధికారం పవర్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇక్కడ ఎల్జీదే(LG). ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వాన్ని నడపగలరు. ఇలా కాకుండా సీఎంను తీహార్‌ జైల్లో (Tihar Jail) ఉంచితే అక్కడి నుంచి ప్రభుత్వాన్ని నడపడం కష్టం. ఎందుకంటే ఇక్కడ భద్రతా అంశాన్ని పరిగనణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

కోర్టు అనుమతి తప్పనిసరినా?
ఖైదీ ఎప్పుడు జైలుకు వచ్చినా జైలు మాన్యువల్ పాటించాల్సిందేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. అండర్ ట్రయల్ ఖైదీ అయినప్పటికీ ఆయన అన్ని అధికారాలు రద్దవుతాయి. అయినప్పటికీ ప్రాథమిక హక్కులు మిగిలి ఉంటాయి. జైలులో ఉన్న నాయకుడు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. జనవరిలో హేమంత్ సోరెన్‌ను (Hemant Soren) ఈడీ అరెస్టు చేసినప్పుడు PMLA కోర్టు విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు అనుమతించింది. ఖైదీ జైల్లో ఉన్నంత కాలం సంబంధిత వ్యక్తి కార్యకలాపాలు కోర్టు ఆదేశాలపై ఆధారపడి ఉంటాయి. ఒక ఖైదీ లాయర్‌ ద్వారా చట్టపరమైన డాక్యుమెంట్‌పై సంతకం చేయవచ్చు. అయితే ప్రభుత్వ పత్రంపై సంతకం చేయడానికి కోర్టు అనుమతి పొందాలంటున్నారు న్యాయనిపుణులు.

రాజ్యాంగం ఏం చెబుతోంది?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం రాష్ట్రపతి లేదా గవర్నర్ పదవిలో ఉన్నంత కాలం వారిని అరెస్టు చేయడం లేదా నిర్బంధించడం కుదరదు. ఆయనకు వ్యతిరేకంగా ఏ కోర్టు కూడా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. అయితే ప్రధానికి, ముఖ్యమంత్రికి, మంత్రికి, ఎంపీకి, ఎమ్మెల్యేకు అలాంటి మినహాయింపు లేదు. సివిల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్-135 ప్రకారం ప్రధాని, కేంద్రమంత్రులు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు, ముఖ్యమంత్రి, శాసనసభ, శాసనమండలి సభ్యులకు సివిల్ కేసుల్లో మాత్రమే అరెస్టు నుంచి మినహాయింపు ఉంది. క్రిమినల్ కేసుల్లో ఉండదు.

మొత్తానికి చూస్తే కేజ్రీవాల్‌ జైలు నుంచి సీఎంగా కొనసాగవచ్చని తెలుస్తోంది.. అయితే ఇది అంత ఈజీ కాదు..!

Also Read: ఒకప్పుడు సీఎం…ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ..పన్నీర్ సెల్వం పరిస్థితి

Advertisment
తాజా కథనాలు