Arogyasri Bills: సూదికి, దూదికి డబ్బుల్లేవ్.. ఆరోగ్యశ్రీ సేవలకు ఆ ఆసుపత్రులు గుడ్ బై! ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1750 కోట్ల బకాయిలు అందేవరకూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నట్లు ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు ప్రకటించాయి. తమ దగ్గర సూదికి, దూదికి కూడా పైసల్లేవని, నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు ఎన్టీఆర్ నెట్వర్క్ ఆసుపత్రులు ఆందోళన వ్యక్తం చేశాయి. By srinivas 14 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి AP Arogyasri : ఆరోగ్యశ్రీపై పేద ప్రజలకు సేవలు అందించేందుకు తమ దగ్గర డబ్బుల్లేవని ఏపీలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే రావాల్సిన బకాయిలు రూ.1750 కోట్లకు చేరిపోయాయని, ప్రభుత్వం బకాయిలు పెట్టినా తాము పని చేస్తున్నామంటూ ప్రకటన విడుదల చేశాయి. ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించే వరకూ సేవలందించే ప్రసక్తే లేదంటున్నాయి. ఎన్టీఆర్ వైద్యసేవా (NTR Vaidyaseva) సేవల బిల్లులు క్రమపద్ధతిలో విడుదల చేసే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో.. నిరంతరం పనిచేస్తున్న రాష్ట్రప్రభుత్వానికి అన్నివిధాలా మా వంతు.. మా స్థాయిలో సహాయసహకారాలు అందించాలనే గట్టి సంకల్పం ఉంది. ఆ సత్తా.. పట్టుదలా.. అంకితభావం ఉంది. కానీ గత కొద్ది నెలలుగా ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రులు ఎదుర్కొంటున్న కష్టాలు.. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రులున్నాయి. గత 8నెలలుగా సరైన చెల్లింపులు లేకపోవటంతో ఆసుపత్రులను నడపటం చాలా కష్టంగా మారింది. ప్రతి ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రికి రావాల్సిన బకాయిలు బాగా పెరిగిపోయాయి. 2023 సెప్టెంబరు వరకు ఆసుపత్రులకు రావాల్సిన బకాయిలు బాగానే వచ్చాయి. ఇక ఆ తరువాత నుండి బకాయిలు బాగా పేరుకుపోతూ వచ్చాయి. 2024 మే నెలకు ఆ బకాయిలు సుమారు రూ.1750కోట్లకు చేరాయి. ఇక మా వల్ల కాదని మేమంతా చేతులెత్తేసినపుడు, అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, అపద్ధర్మ ప్రభుత్వం ఉందని, అందువల్ల రూ.500కోట్లు ఇస్తామని, మమ్మల్ని నమ్మించి, చివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఆ బాధను గుండెల్లోనే దాచుకున్నాం. ఎందుకంటే ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం మా బాధలను అర్ధంచేసుకుంటుందన్న ఆశ. కానీ కొత్త ప్రభుత్వం ఇప్పటి వరకు మా బాధలను వినలేదు. మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాగానీ.. కనీస స్పందన కూడా లేదు. ఇది కూడా చదవండి: TG Govt Jobs: మరో 2 నెలల్లో కొత్త సార్లు.. కళకళలాడనున్న స్కూళ్లు, కాలేజీలు! ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని.. మేం చేస్తున్న సేవలను ప్రభుత్వ పెద్దలు గుర్తిస్తారని, ఈ రోజు కాకపోతే రేపయినా గానీ మా బకాయిలను విడుదలచేస్తారన్న గట్టి నమ్మకంతో ఏదో విధంగా ఇంతకాలం భారంగా నెట్టుకొస్తున్నాం. అందినకాడికి అప్పులు చేయటం, బ్యాంకుల నుండి ఓవర్ డ్రాఫ్ట్ లు తీసుకోవటం వంటి అన్ని అవకాశాలను వాడేసుకున్నాం. ఇప్పుడిక ఉన్న అన్ని మార్గాలు మూసుకుపోయాయి. దూది.. సూది కూడా కొనలేని పరిస్థితుల్లో ఉన్నామంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్ధంచేసుకోవాలని మనవి చేస్తున్నాం. ఇక ఆసుపత్రులను నడపటం మా వల్ల కావటం లేదు. ఇప్పటి వరకు ఉన్న అవకాశాలను అన్నింటినీ పయోగించుకుని, ప్రభుత్వానికి ఎక్కడా చెడ్డ పేరు రాకూడదని, పేద వర్గాలకు కష్టం కలుగకూడదు.. నష్టం జరగకూడదన్న ఉ ద్దేశ్యంతో నడుపుడుతున్న మేము, ఇక ఎంత మాత్రం ఆ భారాన్ని మోయలేని పరిస్థితుల్లో ఉన్నాం. మేము నాలుగు గోడల మధ్య గౌరవంగా, ప్రశాంతంగా పనిచేసుకోవాలని మనసా వాచా కర్మేణా కోరుకునే వాళ్లమేగానీ, రోడ్డెక్కాలని ఎప్పుడూ కోరుకోము. అలాంటి మేము ఇప్పుడిలా నిస్సహాయతను వ్యక్తంచేస్తూ.. ఇక నుండి ఎన్టీఆర్ వైద్యసేవ పథకంలో వైద్యం చేయలేమని చెబుతున్నామంటే, గదిలో బంధించిన పిల్లి ఎలా ప్రతిస్పందిస్తుందో అలా మా పరిస్థితి తయారయిందన్న విషయాన్ని అర్ధంచేసుకోవాలని కోరుతున్నాం. తాజాగా సుమారు రూ.2వేల 500కోట్ల బకాయిలు ఆసుపత్రులకు రావాల్సిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రులకు విడుదలచేసింది, కేవలం రూ.160కోట్లు మాత్రమే. బకాయిలు అడిగిన పాపానికి ఆసుపత్రుల మీద దాడులు.. మా బకాయిలు చెల్లించకపోయినా.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదన్న సదుద్దేశ్యంతో మేం పనిచేస్తుంటే, బకాయిలు అడిగిన పాపానికి మా ఆసుపత్రుల మీద దాడులు చేసి, మమ్మల్ని దొంగలుగా చూపిస్తున్నారు. మన దేశ సంస్కృతిలో మనకు చిన్న సాయం చేసిన వారికి కూడా మనమెంతో రుణపడి ఉంటాం. కానీ అటు పేద వర్గాలకు, ఇటు ప్రభుత్వానికి సేవలందిస్తున్న మాపై దాడులు చేయటం.. దొంగలుగా చూపించటం ద్వారా ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. అయినా సరే ఇక మేము వెనక్కుతగ్గకూడదని నిర్ణయించుకున్నాము. ఇలాంటి విధానాలు మన రాష్ట్రంలో వైద్య రంగం అభివృద్ధికి ఏ మాత్రం దోహదపడవని సవినయంగా మనవిచేస్తున్నాం. వాస్తవానికి ఈపాటికే రాష్ట్రంలో వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉంది. కానీ అది జరగలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మా ఇబ్బందులను పరిష్కరించేందుకు దృష్టిపెట్టాలి. ఇప్పటి వరకు పేరుకు పోయిన బకాయిలను చెల్లించాలి. ఎన్టీఆర్ వైద్యసేవ నెట్వర్క్ ఆసుపత్రుల బకాయిలను క్రమ పద్ధతిలో చెల్లించే విధంగా ఒక విధానాన్ని రూపొందించాలని కోరుకుంటున్నాము. #ap-news #ntr-network-hospitals #ap-arogyasri మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి