సాధారణంగా కొన్ని బ్యాంకులు రుణాలు తీసుకున్న వారిపై అనవసరంగా, అన్యాయంగా ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇలాంటి అక్రమ ఛార్జీలను తీవ్రంగా పరిగణిస్తుంది. తాజాగా RBI నిర్వహించిన తనిఖీల్లో కొన్ని బ్యాంకులు రుణాల విషయంలో అన్యాయంగా, అపారదర్శకంగా వ్యవహరించినట్లు తేలింది. ఈ తనిఖీలు 2023, మార్చి 31కి ముందు జరిగాయి.
ఆర్బీఐ నివేదిక ప్రకారం, కొన్ని బ్యాంకులు అక్రమంగా అధిక వడ్డీ వసూలు చేశాయి. ఫలితంగా రుణ చెల్లింపుల (Loan repayment) విషయంలో స్పష్టత లేకపోవడం వల్ల రుణ గ్రహీతలు నష్టపోయారు. కొన్ని బ్యాంకులు రుణాలను మంజూరు చేసేటప్పుడు (Loan disbursement) సరైన నిబంధనలు పాటించలేదు. ఈ అనైతిక పద్ధతుల వల్ల లోన్ తీసుకున్న వారు అనవసరంగా ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి వచ్చింది. 4 మార్గాల్లో బ్యాంకులు రుణ గ్రహీతలపై అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు RBI కనిపెట్టింది. అవేవో చూద్దాం.
* నాలుగు మార్గాల్లో ఓవర్ ఛార్జింగ్
బ్యాంకు లోన్ మంజూరు చేసిన రోజు నుంచే వడ్డీ వేస్తున్నారు. డబ్బులు ఖాతాలో జమ అయిన రోజు నుంచి కాకుండా, లోన్ దొరికిందని చెప్పిన రోజు నుంచే వడ్డీ వసూలు చేస్తున్నట్లు RBI ఎగ్జామినేషన్స్‌లో తేలింది.చెక్కు ద్వారా లోన్ ఇస్తే జేబుకు చిల్లే. ఎందుకంటే చెక్కు ఇచ్చిన రోజు నుంచే వడ్డీ వేస్తున్నారు. కానీ ఆ చెక్కు డబ్బులు తీసుకోవడానికి కొన్ని రోజులు పట్టొచ్చు.
నెల మధ్యలో లావాదేవీలు జరిగినా, పూర్తి నెల వడ్డీ వేస్తున్నారు. న్యాయంగా లోన్ ఉన్న రోజులకు మాత్రమే వడ్డీ వేయాలి.ముందస్తు ఇన్‌స్టాల్‌మెంట్స్ రూపంలో మరో మోసం. కొన్ని సందర్భాల్లో ఒకటి కంటే ఎక్కువ ఇన్‌స్టాల్‌మెంట్స్ ముందుగానే కట్టినా, వడ్డీ లెక్కించేటప్పుడు మొత్తం లోన్ అమౌంట్ లెక్కలోకి తీసుకుంటున్నారు. అంటే, ముందే చెల్లించిన డబ్బులపై కూడా వడ్డీ వసూలు చేస్తున్నారు.
న్యాయమైన పద్ధతుల్లో వడ్డీ వసూలు చేయాలి
బ్యాంకులు రుణాలపై వడ్డీ వసూలు చేసే విషయంలో నిబంధనలు ఉన్నాయి. రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు న్యాయంగా, స్పష్టంగా వ్యవహరించాలని ఈ నిబంధనలు చెబుతున్నాయి. అయితే, RBI తనిఖీల్లో కొన్ని బ్యాంకులు ఈ నిబంధనలను పాటించడం లేదని తేలింది. పైన పేర్కొన్న నాలుగు మార్గాలలో బ్యాంకులు రూల్స్ అతిక్రమిస్తున్నాయి.ఇలాంటి పద్ధతులు బాంకుల న్యాయబద్ధమైన పద్ధతుల కోడ్ (Fair Practices Code)కు విరుద్ధం. అందుకే, RBI అన్ని బ్యాంకులకు చెబుతోంది. ఎప్పుడు లోన్ డబ్బులు ఖాతాలో పడతాయో, అదే రోజు నుంచే వడ్డీ వేయాలి. చెక్కులు ఇచ్చే బదులు, నేరుగా ఖాతాలో డబ్బులు జమ చేయడం మంచిది. నెల మధ్యలో లావాదేవీలు జరిగినా, లోన్ ఉన్న రోజులకు మాత్రమే వడ్డీ వేయాలి. బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటున్నప్పుడు, వారు చెప్పే వడ్డీ వివరాలు, ఛార్జీలు జాగ్రత్తగా చూసుకోవాలి.