ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌లు మరింత అడ్వాన్స్‌డ్ అవుతున్నాయి. కొత్త కొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నాయి. చాలామంది హెల్త్ ట్రాకింగ్ కోసం, హార్ట్ రీడింగ్స్ కోసం యాపిల్ వాచ్ మోడల్స్ వాడుతున్నారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో యాపిల్ వాచ్ అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ప్రజల ప్రాణాలను రక్షించాయి. ఆరోగ్య పరిస్థితిని కచ్చితంగా అంచనా వేసి, సకాలంలో వైద్య సహాయం అందడంలో కీలక పాత్ర పోషించాయి. ఇందుకు అవసరమైన అడ్వాన్స్‌డ్ సెన్సార్లు ఈ డివైజ్‌లో ఉన్నాయి. అయితే యాపిల్ వాచ్ మరో లేటెస్ట్ ఫీచర్‌తో రానుంది.
* ఎలా పని చేస్తుంది?
కొత్త పేటెంట్‌లో యాపిల్ కంపెనీ వాచ్ నీటిలో ఎలా అలర్ట్ పంపుతుందో వివరించింది. యాపిల్ వాచ్‌లో ఇప్పటికే బిల్ట్ చేసిన సెన్సార్‌లను ఉపయోగించుకుంటుందని పేర్కొంది. ఒక వ్యక్తి నీటి అడుగున అసౌకర్యంగా లేదా బాధలో ఉన్నప్పుడు వాచ్ గుర్తించగలదు. దీన్ని ధరించిన వ్యక్తి నీటిలో మునిగిపోతున్నాడనే సిగ్నల్ పంపుతుంది.
నీటి లోపల వ్యక్తి శరీరం సరైన పొజిషన్‌లోనే ఉందో లేదో సెన్సార్లు పరిశీలిస్తాయి. నీటి అడుగున వ్యక్తి స్థితిని తెలుసుకోవడానికి యాపిల్ వాచ్ హృదయ స్పందన రేటు, O2 లెవల్స్ కూడా చెక్ చేస్తుంది. అలాగే యాపిల్ తన సొంత మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ను కూడా ఉపయోగిస్తుంది. ఇది వ్యక్తి మునిగిపోతున్నాడో లేదో అంచనా వేయడానికి సహాయపడుతుంది.
నీటిలో యాపిల్ వాచ్ ధరించిన వ్యక్తి సమస్యలో ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే, కొలను లేదా బీచ్‌కు సమీపంలో ఉన్న ఐఫోన్ యూజర్లు అందరికీ యాపిల్ వాచ్ SOS మెసేజ్ పంపుతుంది. ఐఫోన్ వినియోగిస్తున్న, ఆ సమీపంలో ఉన్న అందరికీ అలర్ట్ వెళ్తుంది. అయితే కేవలం ఐఫోన్ యూజర్లకు మాత్రమే దీనిపై అలర్ట్ వెళ్లడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులకు సహాయం అందించే అవకాశాలు తగ్గుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అవసరమైతే, దీన్ని యాపిల్ అన్ని ప్లాట్‌ఫారమ్స్‌కు అందుబాటులోకి తీసుకొస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
యాపిల్ వాచ్, వాచ్ అల్ట్రా సిరీస్ మోడల్స్ నీటి అడుగున కూడా పనిచేస్తాయి. ఇవి స్కూబా డైవర్లు, ఇతర అడ్వెంచర్ స్పోర్ట్స్ పర్సన్స్, వ్యక్తులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది. ప్రమాదవశాత్తూ ప్రజలు నీటిలో మునిగిపోతే వారిని అప్రమత్తం చేసే అవకాశం ఉండటంతో ఫీచర్ మరింత పాపులర్ అవుతుందని, దీంతో ఎక్కువ మంది డివైజ్‌ను వినియోగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
* యాపిల్ వాచ్ 10 అప్‌డేట్
మరోవైపు యాపిల్ కంపెనీ కొత్త యాపిల్ వాచ్ 10 మోడల్ లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఉపయోగించే కొత్త డిస్‌ప్లే టెక్నాలజీ, బ్యాటరీ లైఫ్‌ను ఎక్స్‌టెండ్ చేస్తుందని చెబుతున్నారు. స్క్రీన్ ఎఫిషియన్సీని పెంచేందుకు TFTతో పాటు LTPO డిస్ప్లే టెక్‌ను స్వీకరించడానికి యాపిల్ సిద్ధంగా ఉందని నివేదికలు పేర్కొన్నాయి. ఈ చర్యలు గాడ్జెట్ బ్యాటరీ లైఫ్‌ని మరింత పెంచుతాయి.