CM Chandrababu : విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికను అధికార కూటమితో పాటు వైసీపీ (YCP) సీరియస్ గా తీసుకుంది. తమ సిట్టింగ్ స్థానంలో విజయం సాధించి సత్తా చాటాలని వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే.. కూటమి తరఫున టీడీపీ (TDP) ఇక్కడ పోటీ చేయడం ఖరారైనా.. అభ్యర్థి పేరు మాత్రం ఇంకా ఖరారు కాలేదు. దీంతో చంద్రబాబు వ్యూహం ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అభ్యర్థి ఎంపికపై చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఆయన ఓ కమిటీని సైతం నియమించినట్లు సమాచారం.
Also Read : నిర్మాణంలో కైగా పవర్ ప్లాంట్.. మేఘా కంపెనీ మరో విపత్తుకు దారి తీస్తుందా?
ఇప్పటికే జిల్లాకు చెందిన ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 838 కాగా.. కూటమికి కేవలం 250 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. దీంతో చంద్రబాబు గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు రచిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది. బొత్సకు ధీటైన అభ్యర్థి ఎవరన్న అంశంపై టీడీపీ అధినేత స్థానిక నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ రెండు మూడు రోజుల్లోనే టీడీపీ అభ్యర్థి పేరును ప్రకటించే అవకాశం ఉంది.
మరో వైపు నామినేషన్ల ప్రక్రియ రేపు ఉదయంతో ప్రారంభం కానుంది. వైసీపీ అభ్యర్థి బొత్స మొదటి రోజే నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నామినేషన్ తర్వాత క్యాంపు రాజకీయాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) తర్వాత ఏపీ (Andhra Pradesh) లో తొలిసారిగా జరుగుతున్న ఈ సమరంలో ఎవరు సత్తా చాటుతారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.