బుడమేరు వరద బీభత్సం ఎలా ఉంటుందో ఇప్పుడు విజయవాడ ప్రజానీకానికి బాగా తెలిసివచ్చింది. ఒక్క వరద వేలాది కుటుంబాలను వీధిన పాడేసింది. ఒక్కసారి బుడమేరు కన్నెర్ర చేస్తే విజయవాడలో లక్షలాది మంది ప్రజలు వరద నీటిలో అన్నమో రామ చంద్రా అంటూ బతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే బుడమేరు విజయవాడలో శాంతిస్తోంది. మరి ఈ బుడమేరు నీరంతా ఎక్కడ పోతోంది? ఈ వరద నీరంతా బుడమేరు డ్రైయిన్ ద్వారా కొల్లేరు సరస్సులోకి చేరుతోంది. అంటే ఇప్పుడు కొల్లేరుకు డేంజర్ బెల్స్ మొదలయ్యాయి.
విజయవాడలో తీవ్ర విధ్వంసం తరువాత మెల్లగా కొల్లేరులో బుడమేరు నీరు వచ్చి చేరుతుండడంతో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఎప్పుడు కొల్లేరు పొంగి తమ ప్రాంతాలను ముంచేస్తుందో అని టెన్షన్ పడుతున్నారు. ఇప్పటికే మండవల్లి మండలంలో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడి పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, నందిగామలంక గ్రామాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. అలాగే మణుగులూరు, కొవ్వాడలంక గ్రామాల్లోనూ నీరు చేరింది. అదేవిధంగా చినఎడ్లగాడి దగ్గర ఏలూరు-కైకలూరు ప్రధానరహదారిపై రెండడుగుల ఎత్తులో ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తోంది. దీంతో కొల్లేరు విస్తరించి ఉన్న ఏలూరు జిల్లాలోని ఏలూరు, మండవల్లి, కైకలూరు మండలాల్లో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
ఆక్రమణలు.. కొల్లేరును కకావికలం చేశాయి..
కొల్లేరు సరస్సు ఆసియాలోనే ఆహ్లాదకరమైన అతి పెద్ద మంచినీటి సరస్సు. ఇది వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే వలస పక్షులకు ఆశ్రయం ఇస్తుంది. ఇక్కడ ప్రపంచ ప్రసిద్ధి చెందిన పక్షులు వలస వచ్చి గూడు కట్టుకుని కొంతకాలం తరువాత తిరిగి వెళ్లిపోతాయి. వృక్షజాలం, జంతుజాలంతో సమృద్ధిగా ఉన్న ఈ సరస్సు ఎప్పుడూ అక్టోబర్ - మార్చి నెలల మధ్య ఉత్తర ఆసియా, తూర్పు ఐరోపా నుండి వలస పక్షులను ఆకర్షిస్తుంది. ఈ సీజన్‌లో, సరస్సును దాదాపు రెండు మిలియన్ల పక్షులు సందర్శిస్తాయని అంచనా.
కృష్ణా-గోదావరి డెల్టాల మధ్య ఇది వ్యాపించి ఉంది. ప్రస్తుతం ఈ సరస్సు కుచించుకుపోయింది. దీనికి కారణం ఆక్రమణలే. భారతీయ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం 9 ఫిబ్రవరి 2001న తీసిన ఉపగ్రహ చిత్రాలు 245 కిమీ అంటే దాదాపు 42% ఆక్వా కల్చర్ ఆక్రమించిందని , వ్యవసాయంమరో 8.5% ఆక్రమించిందని తేల్చాయి. ఆక్వాకల్చర్ కింద ఉన్న ప్రాంతంలో సరస్సు లోపల 1,050 చేపల చెరువులు మరియు 38 ఎండిపోయిన చేపల చెరువులు ఉన్నాయి. ఇవి కలిసి 103 కిమీ విస్తీర్ణంలో ఉన్నాయి . ఆక్వాకల్చర్ మత్స్యకారులు చేపలను పక్షులు తినకుండా తుపాకీ కాల్పులు జరుపుతారు. వ్యవసాయ ఆక్రమణలు ఎక్కువగావరిపైర్లు. ఆశ్చర్యకరంగా, ఉపగ్రహ చిత్రంలో స్పష్టమైన నీరు ఇక్కడ కనపడలేదు. మిగిలిన సరస్సు నీటి మళ్లింపుతో తగ్గిపోతుంది లేదాఏనుగు గడ్డి, వాటర్ హైసింత్ వంటి కలుపు మొక్కలతో నిండి ఉంటుంది.
ఉప్పుటేరును మాయం చేసేశారు..
కొల్లేరులో అధికంగా వచ్చి చేరే నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తుంది. మొగల్తూరు మండలంలోని మూలపర్రు వద్ద సముద్రంలో ఉప్పుటేరు కలిసే వరకూ ఉన్న ప్రాంతం అంతా ప్రస్తుతం ఆక్రమణల్లో ఉంది. ఆక్వాసాగు కోసం దాదాపు 5 వేల ఎకరాలు ఆక్రమించేశారని తెలుస్తోంది. అంతేకాకుండా, చాలా చోట్ల ఉప్పుటేరు మీదనే ఇళ్ళు కూడా నిర్మించేశారు. ఈ ఉప్పుటేరు ద్వారా రోజుకు 15 వేళా క్యూసెక్కుల నీరు వరకూ సముద్రంలోకి వెళ్లే ఏర్పాటు స్వతహాగా ఉండేది. ఈ ఆక్రమణల కారణంగా అది దాదాపు 10వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. ఇక ఈ ఉప్పుటేరు నిర్వహణ పూర్తిగా పక్కన పెట్టేశారు. ఉప్పుటేరులో ఎప్పటికప్పుడు (కనీసం రెండేళ్లకోసారన్నా) పూడికలు తీయాల్సిన అవసరం ఉంటుంది. ఏళ్లకు ఏళ్లుగా ఆ పని చేయడం మానేశారు. దాదాపుగా 12 ఏళ్ల క్రితం ఆ పని జరిగింది. ఆ తరువాత అక్కడక్కడా కొంత వరకూ నిర్వహణ చేశారు. కానీ, గత ఐదేళ్లుగా కనీసం ఆ మాత్రం కూడా నిర్వహణ చేయలేదు. కనీసం గుర్రపు డెక్క వంటి కాలువలను ఆక్రమించే మొక్కలను కూడా తొలగించలేదు.
ఇప్పుడిదంతా ఎందుకంటే..
బుడమేరుకు వరద వస్తే ఆ నీరంతా కొల్లేరులోకే వెళుతుంది. కొల్లేరు ఈ నీటితో నిండిపోతే ఎక్కువైన నీరు ఉప్ప్పుటేరు ద్వారా సముద్రంలోకి వెళ్ళాలి. కానీ, ఇప్పుడు ఉప్పుటేరులో చాలా భాగం ఆక్రమణలో ఉంది. కొంత భాగం పూడికలు తీయకపోవడం, నిర్వహణ చేయకపోవడంతో పూడిపోయింది. ఇప్పుడు కనీసం 10 వేల క్యూసెక్కుల నీటిని కూడా ఉప్పుటేరు భరించే పరిస్థితి కనిపించడం లేదు. బుడమేరు వరద నీరు రోజుకు 30 వేల క్యూసెక్కుల వరకూ కిందికి వస్తోంది. అందులో కొంత అటూ ఇటూ పోయినా దాదాపు 20వేల క్యూసెక్కుల వరకూ కొల్లేరును చేరే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే కొల్లేరులో రోజుకు 10వేల క్యూసెక్కులు ఉండే నీరు 25వేల క్యూసెక్కులకు చేరింది. దీంతో ఇప్పుడు రోజుకొక మరొక 20వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరితే, కొల్లేరు పరిస్థితి ఎలా ఉంటుందనేది ఊహకందదు. పైగా ఇప్పుడు కొల్లేరు క్యాచ్ మెంట్ ఏరియాలో ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఆ నీరంతా కొల్లేరుపైనే భారం వేస్తుంది.
ప్రమాదకరంగా పరిస్థితులు..
ఈ లెక్కలన్నీ అంచనాగా వేసినవి. వీటిలో సగం లెక్కలు కరెక్ట్ అయినా.. కొల్లేరుకు ప్రమాదం పొంచి ఉన్నట్టే. అదే పూర్తిగా ఈ లెక్కలు నిజం అయితే.. పరిస్థితి ఎలా ఉంటుంది అనేది అంచనా వేయలేం. ఇప్పుడు చేయాల్సింది కొల్లేరు చుట్టుపక్కల ఉన్నవారిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ఏమి చేయాలో చూడటమే. అప్రమత్తంగా ప్రతి క్షణం ఉండాల్సిన పరిస్థితి ఉంది.
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి..
ప్రభుత్వం కూడా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే, ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు చెబుతున్న సూచనలు పాటిస్తూ.. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాల్సి ఉంది.