పవన్ కల్యాణ్‌కున్న మాస్ ఫాలోయింగ్ ఆయన సభలకు పెద్ద ఎత్తున వస్తున్న జనాలపై జనసేన భారీస్థాయిలో ఆశలు పెట్టుకుంది. మొదటిసారి పవన్ కల్యాణ్ జూన్ 14న కత్తిపూడి నుంచి వారాహి యాత్రను ప్రారంభించారు. అదే నెల 30న భీమవరం సభతో ముగించారు. గోదావరి ఉమ్మడి జిల్లాల్లో మొత్తం పది నియోజకవర్గాలను కవర్ చేశారు. ఈ సందర్భంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఆయన చేసిన విమర్శలు కలకలం రేపాయి. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి అత్యంత అవినీతిపరుడని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో వైసీపీ ఎదురుదాడికి దిగింది. ఇదే సందర్భంగా కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ద్వారంపూడికి మద్దతుగా నిలిచారు.
పవన్ వర్సెస్ వైసీపీ
పవన్ వర్సెస్ వైసీపీగా మొత్తం సీన్ మారిపోయింది.వైసీపీ తరపున ముద్రగడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అందుకే ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం సాగింది. కాపు సామాజిక వర్గాన్ని జనసేన వైపు తిప్పుకోవడానికే పవన్ కల్యాణ్ ఈ వ్యూహంతో ముందుకెళ్లారు. పవన్ నాలుగు పెళ్లిళ్ల అంశాన్ని సీఎం జగన్‌తో సహా వైసీపీ నేతలంతా ఎదురుదాడికి దిగారు. దీంతో రెండో విడత వారాహి యాత్రలో దీనిపై పవన్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జూలై 9 నుంచి ఏలూరులో ప్రారంభించి తణుకు సభతో ముగించారు. ఏపీలో వాలంటీర్ల అంశాన్ని గ్రామవాలంటీర్లు ఒంటరి మహిళల్ని లక్ష్యంగా చేసుకున్నారని, ఏపీలో వేల మహిళలు మిస్సవడానికి వాలంటీర్లే కారణమని పవన్ అన్నారు.
జగనన్న డబుల్ బెడ్రూంలను సందర్శించిన జనసేన సైనికులు
ప్రజల వ్యక్తిగత డేటా ఎక్కడ భద్రపరుస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారికి అందుతున్న గౌరవ వేతనంపై కూడా విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్‌పై విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం జనసేన వినూత్న కార్యక్రమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జనసేన సైనికులు జగనన్న డబుల్ బెడ్రూంలను సందర్శించింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మూడో విడత వారాహి యాత్రపై పవన్ ఏం చేయనున్నారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.