Bhavani Shankari: భారీ వర్షాలకు ఏపీలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. విజయవాడ పరిసర ప్రాంతాలు నీట ముగినిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో రక్షణ చర్యల నేపథ్యంలో నేరుగా రంగంలోకి దిగిన నూజివీడు సబ్ కలెక్టర్ భవానీ శంకరీ.. 8 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి 82 మందిని కాపాడారు. విపత్కరమైన పరిస్థితుల్లో ధైర్యం చేసి తమ ప్రాణాలు కాపాడిన భవాని శంకరీపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రమాదానికి ఎదురొచ్చి తమను రక్షించిన కలెక్టర్ కు ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఆమెను ప్రశంసించారు. నీటిలో శంకర్ చేపట్టిన పనులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇది నా డ్యూటీ..
ఈ సందర్భంగా RTVతో మాట్లాడిన భవాని శంకరీ.. నూజివీడులో వరదలు రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పారు. టౌన్ లో ఉన్న రెండు పెద్ద చెరువులు నిండి ఇలా కట్ట తెగుతుందని ఎవరూ ఊహించలేదన్నారు. డ్యూటీ టైమ్ అయిపోయినప్పటికీ సాధ్యమైనంత వరకూ పని చేయాలని అనుకున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే రాత్రి చాలా సేపు అక్కడే ఉండి జాగ్రత్తలు తీసుకున్నట్లుతెలిపారు. ఇక ప్రశంసలపై స్పందిస్తూ.. 'ఇది నా డ్యూటీ. అందరినీ సేఫ్ చేయడం మా బాధ్యత. ఇది నాకు ఫస్ట్ ఉద్యోగం. వరదల అనుభవం ఇదే మొదటిసారి. ఇది భవిష్యత్తులోనే మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. మరో వారంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దానికోసం ఏర్పాట్లు చేసుకున్నాం' అని భవానీ శంకరీ తెలిపారు.