ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏఆర్ అనురాధను గవర్నర్ నియమించారు. గత జగన్ సర్కార్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను 2022 మార్చిలో ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా నియమించింది. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఏడాది జులై 4న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అప్పటి నుంచి ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో ఏఆర్ అనురాధ పేరును ప్రభుత్వం గవర్నర్ కు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వ సూచన మేరకు గవర్నర్ అనురాధ ను ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో పెండింగ్ నోటిఫికేషన్లకు సంబంధించిన నియామకాలను పూర్తి చేయడంతో పాటు.. కొత్త నోటిఫికేషన్ల విడుదల జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: ప్రజలకు చంద్రబాబు సర్కార్ దీపావళి గిఫ్ట్.. కేబినెట్ కీలక నిర్ణయాలు!
ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన అనురాధ..
అనురాధ విషయానికి వస్తే ఆమె ఇంటెలిజెన్స్ చీఫ్, హోం శాఖ కార్యదర్శి తదితర కీలక బాధ్యతలు నిర్వహించారు. ఏపీ ఇంటెలిజెన్స్ విభాగానికి అధిపతిగా పని చేసిన తొలి మహిళా ఐపీఎస్ అధికారి అనురాధ కావడం విశేషం. అనురాధ 1987 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆమె భర్త నిమ్మగడ్డ సురేంద్రబాబు కూడా ఐపీఎస్ అధికారి.
ఇది కూడా చదవండి: AP: టెన్త్ విద్యార్థులకు అలర్ట్..పరీక్షా విధానంలో మార్పులు!
గత నియామకాల్లో అవకతవకలపై విచారణ..
గత ప్రభుత్వం చేపట్టిన వివిధ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అభ్యర్థుల ఆందోళనలను పట్టించుకోకుండా గత ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఆరోపణలపై ఈ ప్రభుత్వం విచారణ చేపట్టే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీపీఎస్సీకి ఛైర్‌పర్సన్‌గా విశ్రాంత ఐపీఎస్ అధికారిని నియమించినట్లు తెలుస్తోంది.