AP Liquor Policy: ఏపీలో చంద్రబాబు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై సీఐడి దర్యాప్తు కు ఆదేశిస్తూ శాసనసభలో తీర్మానం చేసింది. జగన్ (YS Jagan) హయాంలో జరిగిన మద్యం కుంభకోణాలపై సభలో సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) పవర్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగదు లావాదేవీలు పెద్ద ఎత్తున జరిగాయి కాబట్టి ఈ కేసును ఈడీకి సైతం రిఫర్ చేస్తామన్నారు. ఏపీలో జరిగిన మద్యం కుంభకోణం ఈడీ దర్యాప్తు జరగాల్సిన అంశమని అభిప్రాయపడ్డారు. మద్యం విషయంలో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఐదేళ్లల్లో లక్ష కోట్ల నగదు అమ్మకాలు జరిగాయన్నారు. ఇది ఓ భయంకరమైన స్కాం అని అన్నారు.
ఇది కూడా చదవండి: YSRCP: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా!
అడుగడుగునా తప్పులే..
నేరస్తుడే సీఎం అయితే వ్యవస్థలు ఎలా ఉంటాయో గత ఐదేళ్లల్లో చూశామన్నారు చంద్రబాబునాయుడు. ఎన్నికల సమయంలో మద్య నిషేధం అని హామీ ఇచ్చి.. ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారని ఫైర్ అయ్యారు. మద్యం పాలసీలో అడుగడుగునా తప్పులు చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో తీసుకువచ్చిన మద్యం పాలసీ వల్ల నేరాలు పెరిగాయన్నారు. గత ప్రభుత్వం మద్యం ధరలను 75 శాతం పెంచిందన్నారు. మైండ్ ఉండే ఎవ్వరూ ఈ తరహాలో ఎక్సైజ్ పాలసీ రూపొందించరన్నారు.
ఇష్టారాజ్యంగా వైసీపీ వ్యవహారం..
ఏం చేసినా జరిగిపోతోందనే అహకారంతో ఇష్టానుసారంగా వ్యవహరించారని వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. పాత బ్రాండ్లను తప్పించి.. కొత్త బ్రాండ్లను తెచ్చారన్నారు. పేదలు తాగే తక్కువ ధర మద్యం బ్రాండ్లు లేకుండా చేశారన్నారు. తనకు మద్యం తాగే అలవాటు లేదు కానీ.. ఏదేదో బ్రాండ్లు తెచ్చారని తెచ్చారని చెబుతున్నారన్నారు. MNC బ్రాండ్లకు చెల్లింపులు పెండింగులో పెట్టి.. వేరే బ్రాండ్లను మార్కెట్ లోకి తెచ్చారని ధ్వజమెత్తారు. మద్యం దుకాణాల్లో మొత్తం నగదు లావాదేవీలే ఉన్నాయన్నారు.
రూ.3 వేల కోట్ల నష్టం..
మద్యం అమ్మకాల ఇల్లీగల్ కలెక్షన్ ద్వారానే మొత్తంగా రూ. 3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. లక్ష కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగితే.. కేవలం రూ. 630 కోట్లు మాత్రమే డిజిటల్ అమ్మకాలు జరిగాయన్నారు. నాసిరకం మద్యం ద్వారా రాష్ట్రంలో కిడ్నీ వ్యాధులు 54 శాతం, లివర్ వ్యాధులు 52 శాతం పెరిగాయన్నారు. దేశ చరిత్రలోనే అతి పెద్ద మద్యం కుంభకోణం రాష్ట్రంలో జరిగిందన్నారు. ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేయాలన్నారు. పారదర్శకతతో కూడిన ఎక్సైజ్ పాలసీ ఇవ్వాలన్నారు. మంత్రులందరూ వారి వారి శాఖల్లో అవినీతిని వెలికి తీయాలని చంద్రబాబు ఈ సందర్భంగా సూచించారు. ప్రతిదీ పారదర్శకంగా ఉండాలని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు భయపడే పరిస్థితి రావాలన్నారు. అన్ని అవినీతి కార్యక్రమాల మీద విచారణ జరగాలన్నారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు