YS Jagan Pulivendula Tour: ఓటమి తర్వాత వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ ఈ రోజు తొలిసారి సొంత జిల్లా (Kadapa) పర్యటనకు వెళ్లారు. వైఎస్ ఫ్యామిలీకి కంచుకోట అయిన పులివెందులలోనే ఆయన 3 రోజులు మకాం వేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సొంత జిల్లాలో వైసీపీకి (YCP) కేవలం మూడు సీట్లు మాత్రమే దక్కాయి. దీంతో ఈ ఘోర ఓటమిపై జగన్ పోస్ట్‌మార్టమ్ చేయనున్నారు. కచ్చితంగా గెలుస్తాం అనుకున్న సీట్లలో సైతం ఓటమి ఎందుకు ఎదురైందన్న అంశంపై నేతలతో చర్చించి వివరాలు సేకరించనున్నారు జగన్. కీలక నేతలందరితోనూ భేటీ కానున్నారు.
రానున్న స్థానికసంస్థల ఎన్నికలను సమర్థంగాఎదుర్కునేందుకు ఇప్పటి నుంచే జగన్ వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఓటమి తర్వాత పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తున్న జగన్.. సొంత జిల్లా నుంచే ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చెల్లెలు షర్మిలతో (YS Sharmila) విభేదాలు, వివేకా హత్య వివాదమూ రెండు కూడా మైనస్ అయ్యాయని జగన్‌కు ఫీడ్ బ్యాక్ అందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతీ నేత నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని భవిష్యత్ కార్యాచరణను ఆయన రూపొందించనున్నారు.