YS Jagan : సొంత గడ్డ పులివెందులలో నేడు వైఎస్ షర్మిల(YS Sharmila) ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అన్న జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై(Avinash Reddy) తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రచారంలో భాగంగా షర్మిల మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో న్యాయం ఒకవైపు.. అధర్మం ఒకవైపు ఉందన్నారు. ధర్మ పోరాటం ఒకవైపు.. డబ్బు, అధికారం మరోవైపు ఉందన్నారు. న్యాయం కోసం పోరాడే షర్మిలను గెలిపిస్తారా? హంతకుడు అవినాష్ రెడ్డిని గెలిపిస్తారా? అని ప్రజలను ప్రశ్నించారు. చిన్నాన్నను నరికి చంపిన హంతకులను జగన్ కాపాడుతున్నాడని ఫైర్ అయ్యారు షర్మిల. హంతకులకే మళ్ళీ టికెట్ ఇవ్వడంతోనే తాను ఎంపీగా పోటీ చేస్తున్నానన్నారు.
ఇది కూడా చదవండి: Mudragada: నేనెందుకు సపోర్ట్ చేయాలి.. పవన్ అందుకు పనికిరాడన్న ముద్రగడ
జగన్ చేసిన పనికి వైఎస్ఆర్(YSR), వైఎస్ వివేకా(YS Viveka) ఆత్మలు క్షోభిస్తున్నాయన్నారు. వైఎస్ఆర్, వివేకా మీ బిడ్డలని అన్నారు. తాము వైఎస్ఆర్ కి ఈ గడ్డ అంటే ఎంతో ప్రేమ అని అన్నారు. బతికినంత కాలం ఇక్కడ ప్రజల కోసమే బతికాడన్నారు. వివేకా సైతం ప్రజలకు అండగా నిలిచిన నేత అని కొనియాడారు. ఇలాంటి నేతలు మళ్ళీ బూతద్దం పెట్టి వెతికినా కనపడరన్నారు షర్మిల. వివేకా చనిపోయి 5 ఏళ్లు దాటినా ఇంత వరకు నిందితులకు శిక్ష పడలేదన్నారు.
వివేకానందరెడ్డిని హత్య చేయించింది ఎంపీ అవినాష్ రెడ్డి అని సీబీఐ చెప్పిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి హంతకులను కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ అన్యాయం తట్టుకోలేకనే వైఎస్ఆర్ బిడ్డ పోటీ చేస్తోందన్నారు. తాను వైఎస్ఆర్ బిడ్డ అని.. పులి కడుపున పులే పడుతుందన్నారు. ధర్మం వైపున నిలబడిన షర్మిల గెలిపించాలని వివేకానందరెడ్డి కూతురు సునీత పిలుపునిచ్చారు.