Jagan: కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలి: సీఎం జగన్‌!

ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సీఎం జగన్‌ జిల్లా కలెక్టర్లు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

New Update
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్..నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని హామీ

ఏపీలో మిచౌంగ్‌ తుఫాన్‌ తీవ్ర ప్రభావం చూపుతుంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్‌ ప్రభావం పై 8 జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగన్‌ మాట్లాడుతూ..ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాన్లను ఎలా ఎదుర్కొవాలో ఏపీ ప్రభుత్వానికి తెలుసాని ఆయన అన్నారు.

మంగళవారం సాయంత్రం తుఫాన్‌ బాపట్ల వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గంటకు 110 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వివరించారు. గురువారం నాటికి పరిస్థితులు కొంచెం కుదుట పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేసినట్లు జగన్‌ తెలిపారు. ప్రతి జిల్లాకు రూ. 2 కోట్ల చొప్పున నిధులు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని సీఎం తెలిపారు. ప్రతి జిల్లాకు సీనియర్‌ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమిస్తున్నామని వీరంతా జిల్లా అధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారని వివరించారు.

ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్ల పై ఉందని జగన్‌ అన్నారు. పశువులకూ ఎలాంటి ప్రాణ నష్టం కలగకూడదని అన్నారు. కోతకు వచ్చిన ఖరీఫ్‌ పంటను కాపాడుకోవాలని సూచించారు. రైతులకు అండగా నిలవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

'' అవసరమైన చోట వెంటనే శిబిరాలను తెరిచి ప్రజలను అక్కడకు తరలించాలి. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5, ఎస్డీఆర్‌ఎఫ్‌ టీమ్స్‌ 5 సిద్ధంగా ఉన్నాయి. సచివాలయాలు, వాలంటీర్లను సమర్థవంతంగా వినియోగించుకోండి. సహాయక శిబిరాల్లో వచ్చే ప్రజలకు మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. మందులు, తాగునీరు, మంచి ఆహారం అందించాలి. క్యాంపు నుంచి ఇంటికి తిరిగి వెళ్లే ముందు ప్రతి ఒక్కరికీ రూ.1000 లేదా కుటుంబానికి గతంలో మాదిరిగా కాకుండా రూ.500 పెంచి రూ.2500 ఇవ్వాలి. క్యాంపులకు రాకుండా, ఇళ్లలోకి నీళ్లు చేరిన వారికి 25 కేజీల బియ్యం, కందిపప్పు, పామాయిల్‌, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు కిలోచొప్పున అందించాలి. గాలులు వల్ల, వర్షాల వల్ల గుడిసెల్లాంటివి దెబ్బతింటే వారికి రూ.10వేలు అందించాలి. తుపాను తగ్గు ముఖం పట్టిన 24 గంటల్లో వీటిని అందించాలి" అని సీఎం అన్నారు.

వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత వ్యాధులు ప్రబలకుండా ఆరోగ్య కేంద్రాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా యుద్ద ప్రాతిపదికన నిర్వహించాలన్నారు. విద్యుత్‌, రవాణా సౌకర్యాలకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Also read: మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో అలర్ట్.. తిరుపతి, నెల్లూరుతో పాటు అక్కడికి వెళ్లే రైళ్లు రద్దు!

Advertisment
తాజా కథనాలు