Andhra Pradesh CM YS Jagan: వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వమంటే విశ్వసనీయతకు మారు పేరు అని పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్. గురువారం నాడు జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వం చేపట్టబోయే పలు కార్యక్రమాల గురించి వివరించారు. జనవరి నెలలో 3, ఫిబ్రవరి నెలలో ఒక కార్యక్రమం చేపట్టబోతున్నామని ప్రకటించారు సీఎం జగన్.
'జనవరి 1 నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ.3 వేలకు పెంచడం జరుగుతుంది. జనవరి 1 నుంచి 8 వరకు పెన్షన్ల పెంపు కార్యక్రమం ఉంటుంది. గత ప్రభుత్వంలో పింఛన్ రూ.1000 మాత్రమే ఇచ్చేవారు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్ రూ.2,250కి పెంచడం జరిగింది. ఇప్పుడు పింఛన్ రూ.3 వేల వరకూ పెంచుకుంటూ వచ్చాం. జనవరి 19న అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. జనవరి 23 నుంచి 31 వరకు ఆసరా కార్యక్రమం ఉంటుంది.' అని వివరించారు సీఎం జగన్.
వైఎస్ఆర్ చేయూత..
'ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఉంటుంది. అర్హత ఉండీ ఎవరైనా ఎక్కడైనా మిగిలిపోతే.. వారికి పథకాలు వర్తింపచేసే బై యాన్యువల్ కార్యక్రమం జనవరి 5న జరుగుతుంది. 66,34,742 మందికి.. రూ.1968 కోట్లకు పైగా పింఛన్ల రూపంలో అందుతాయి. పింఛన్‌ల పెంపు కార్యక్రమంలో నేను 3వ తేదీన కాకినాడలో పాల్గొంటాను. ఎమ్మెల్యేలు ప్రతి మండలంలో పింఛన్ల పెంపు కార్యక్రమంలో పాల్గొనాలి. 8 రోజులపాటు పెంచిన పింఛన్లతో.. పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండే ప్రభుత్వం మనది. ఆసరా కోసమే రూ.25,570 కోట్లు వెచ్చించాం. మూడు విడతలుగా ఇప్పటికే రూ.19,95 కోట్లు ఇచ్చాం. చివరి విడతగా రూ.6,394 కోట్లు ఇస్తున్నాం. జనవరి 23 నుంచి 31వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా 78.94 లక్షల మంది మహిళలు లబ్ధి పొందుతారు. పెన్షన్ కానుక, ఆసరా, చేయూత లబ్ధిదారుల విజయగాథలను వీడియో రూపంలో పంపాలి. పంపిన వాటిలో అత్యుత్తమమైన వాటికి బహుమతులు అందజేయడం జరుగుతుంది.
బహుతులు..
సచివాలయ స్థాయిలో రూ.10 వేలు
మండలస్థాయిలో రూ.15 వేలు
నియోజకవర్గ స్థాయిలో రూ.20 వేలు
జిల్లా స్థాయిలో రూ.25 వేలు బహుమతులు అందజేయడం జరుగుతుందని సీఎం తెలిపారు. అలాగే, ఫిబ్రవరి 15 -16 తేదీల్లోనే.. ఉత్తమ సేవలు అందించినందుకు గానూ వలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు.
మహిళలకు చేయూత..
ఫిబ్రవరి 5 నుంచి 14వ తేదీ వరకూ వైఎస్‌ఆర్ చేయూత కార్యక్రమం ఉంటుందన్నారు సీఎం జగన్. ఈ పథకం కింద ఇప్పటి వరకూ రూ.14,129 కోట్లు ఇచ్చామన్నారు. ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో.. 45 ఏళ్లు పైబడి ఉన్న మహిళలకు ఏడాదికి రూ.18,750 ఇచ్చామన్నారు సీఎం. యూనిక్ లబ్ధిదారులు 31,23,466 మంది ఉన్నారని, ఈ పథకం వారి జీవితాల్లో ఎటువంటి మార్పు తెచ్చిందో చెప్పాలన్నారు. చివరి విడత ద్వారా 26,39,703 మంది లబ్ధి పొందుతున్నారని తెలిపారు సీఎం.
Also Read:
సీఎం జగన్‌తో అంబటి రాయుడు భేటీ.. ఆ సీటు కన్ఫామ్ అయినట్లేనా?!