ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమాన్ని కార్యకర్తులు, నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరి అటల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. అటల్ జీవితం దేశ సేవకు అంకితమయ్యారన్నారు. అటల్ జీవితం బీజేపీ కార్యకర్తకు దిక్సూచిలాంటిదని తెలిపారు. పోఖ్రాన్ అణు పరీక్షలు చేసిన ధీరోధాత్తుడు అని తెలిపారు.
దేశం ఎదుర్కొన్న అతి పెద్ద బానిసత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారన్నారు. చాలా పిన్న వయస్సులోనే సామాజిక కార్యక్రమాలు చేపట్టారన్నారు.
నేటి యువత అటల్ స్ఫూర్తితో పని చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీని అధికారంలోకి తెచ్చిన ఘనత అటల్ దే అని చెప్పుకొచ్చారు. సుపరిపాలన అంటే అటల్ గుర్తొస్తారన్నారు. అటల్ చూపిన మార్గంలో నడుస్తామని దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు.
రాజకీయాల యుగ పురుషుడుగా పిలుచుకునే భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఐదో వర్దంతి నేడు. విలక్షణమైన వ్యక్తిత్వం వాజ్ పేయికి మాత్రమే సొంతం. పార్టీలకు అతీతంగా ఆయనను అందరూ స్మరిస్తారు. కీర్తిస్తారు. కొనియాడతారు.
భారత దేశానికి మూడు సార్లు ప్రధాన మంత్రిగా సేవలందించి..నిస్వార్థ రాజకీయ నాయకుడిగా ఆయన అందరి మన్ననలు పొందారు. వాజ్ పేయి బీజేపీ తొలి జాతీయ అధ్యక్షుడిగా కీర్తి గడించారు. ఆయన రాజకీయ జీవిత కాలంలో 10 సార్లు లోక్ సభకు, 2 సార్లు రాజ్య సభకు ఎన్నికయ్యారు.
అటల్ తన అద్భుతమైన వాక్ పటిమ, ఉచ్చారణ ద్వారా పార్లమెంట్ లో తనదైన ముద్ర వేసుకున్నారు. 2005 లో ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఆ తరువాత సాధారణ ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు.
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ..2018 ఆగస్టు 16 న ఆయన కన్నుమూశారు. అటల్ పేరు చెప్పగానే ముందుగా ఎవరికైనా గుర్తుకు వచ్చేది 1998 పోఖ్రాన్ అణు పరీక్ష. ప్రపంచానికి తెలియకుండా ఐదు అణు పరీక్షలను నిర్వహించి అణ్వాయుధ దేశంగా భారత్ అవతరించింది.
మూడు నెలల పాటూ జరిగిన కార్గిల్ యుద్దం అటల్ ప్రధానిగా ఉన్నప్పుడే జరిగింది. కార్గిల్ విజయం వాజ్ పేయి రాజకీయ ప్రతిష్టను మరింత పెంచింది. 2015 వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం భారత రత్నతో వాజ్ పేయిని గౌరవించింది.