AP Assembly Sessions 2024: ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది. ఈ రోజు శాసనసభలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) ప్రమాణ స్వీకారం చేశారు. జీవీ అంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు మాత్రం ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయలేదు. దీంతో ఈ రోజు 172 మంది శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం మాత్రమే పూర్తయింది. రేపు ఉదయం 10.30 గంటలకు శాసనసభ ప్రారంభం అవుతుంది. మొదట మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలతో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. వీరి ప్రమాణం తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుంది.
ఇదిలా ఉంటే.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్నపాత్రుడి (Ayyannapatrudu) తరఫున కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ సీఎం పవన్ (Pawan Kalyan), మంత్రులు లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ తదితరులు ఈ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పీకర్ గా అయ్యన్న ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ సందర్భంగా అచ్చన్న మాట్లాడుతూ.. తాను 1983నుంచి రాజకీయాల్లో ఉన్నానన్నారు. చివరి దశలో స్పీకర్ పోస్ట్ వచ్చిందన్నారు. ఆ కుర్చీలో కూర్చుంటే పార్టీ గుర్తుకు రాదన్నారు.