ఇప్పటికే స్కిల్ డవలప్మెంట్ కేసు (Skill Development Case), ఫైబర్ గ్రిడ్, ఐఆర్‌ఆర్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు (Chandrababu Naidu) మరో షాక్ తగిలే అవకాశం ఉంది. 2015లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు (Cash For Vote) కేసు తాజాగా మళ్ళీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టులో అక్టోబర్ 4వ తేదీన ఈ ఓటుకు నోటు కేసు లిస్టయింది. ఈ కేసుకు సంబంధించి 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ వేశారు.
ఇది కూడా చదవండి: Chandrababu: దీక్షకు సిద్దమైన చంద్రబాబు.. ఎప్పుడంటే.!
కేసు వివరాలు:
2015లో ఈ కేసు జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నామంటూ తెలంగాణ ఏసీబీ ఓ వీడియో విడుదల చేసింది. ఆ విడియోలో నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డి స్పష్టంగా కనిపించారు. చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఓ ఆడియో కూడా బయటకు వచ్చింది. దీంతో ఆ కేసు అప్పట్లో సంచలనంగా మారింది. ఆ డబ్బులను చంద్రబాబే పంపించాడని ఆరోపించారు వైసీపీ, నాటి టీఆర్ఎస్ నేతలు.
అయితే.. ఈ సంచలన కేసు రాను రాను సైలెంట్ అయిపోయింది. అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి కూడా బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే.. స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయి జైలులో ఉన్న ఈ సమయంలో ఈ కేసు మళ్లీ బయటకు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు ఈ కేసుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది టీడీపీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.