West Godavari : ఉభయగోదావరి జిల్లాల్లో గల్ఫ్ దేశాల (Gulf Country) బాధితుల సంఖ్య పెరుగుతోంది. పొట్టకూటి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన తెలుగోళ్ళు అక్కడే చిక్కుకొని తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోషల్ మీడియా (Social Media) ద్వారా తమ వ్యధలను బయటపెడుతున్నారు బాధితులు. ఇటీవలే మంత్రి నారా లోకేష్ చొరవతో సౌదీ నుంచి ఏలూరు జిల్లా ఆగిరిపల్లికి చెందిన మెహరున్నీసా స్వస్థలానికి తిరిగొచ్చిన సంగతి తెలిసిందే.
తాజాగా, ఏజెంట్ ద్వారా కువైట్ వెళ్లిన సంకురమ్మ అనే బాధితురాలు వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం నుంచి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం చెందిన తాటి సంకురమ్మ గల్ఫ్ లో చిక్కుకుపోయింది. గత కొన్ని నెలలుగా ఆమెకు జీతం ఇవ్వకుండా యజమాని చిత్రహింసలకు గురిచేస్తోన్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. తన బాధను సెల్ఫీ వీడియో ద్వారా రహస్యంగా కుటుంబ సభ్యులకు పంపింది.
Also Read: వయనాడ్‌లో భయంకరమైన పరిస్థితులు.. RTVతో కేరళ వ్యక్తి తెలుగులో మాట్లాడుతూ..
ఇంట్లో పది మంది ఉంటే తన ఒక్కదానిపైనే పని భారం అంతా మోపుతున్నారని సంకురమ్మ వాపోయింది. తాను ఇంటికి వెళ్లిపోతానని యజమానికి చెబితే గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని, ఏజెంట్ కు చెబితే పట్టించుకోలేదని చెబుతోంది. కనీసం భోజనం కూడా పెట్టడం లేదని, తనకు ఆరోగ్యం బాలేకపోయినా పట్టించుకోవట్లేదని కన్నీటిపర్యంతం అయింది. తాను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటే చనిపోతానని, తనను కాపాడాలని వీడియోలో కోరింది.
ఈ విషయం పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు తెలియడంతో సంకురమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కువైట్ లో ఉన్న బాధితురాలు సంకురమ్మతో వీడియో కాల్ లో మాట్లాడి ఆమెకు ధైర్యం చెప్పారు జనసేన (Janasena) ఎమ్మెల్యే బాలరాజు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇండియాకు రప్పించే ఏర్పాట్లు చేస్తామని, ఆందోళన చెందవద్దని సంకురమ్మకు ఎమ్మెల్యే భరోసా కల్పించారు.