కెనడాలో మరో హిందూ ఆలయంపై దాడి జరిగింది. బ్రిటీష్ కొలంబియాలోని సర్రే టౌన్ లోని ప్రముఖ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయాన్ని ఖలిస్తాన్ మద్దతుదారులు కూల్చి వేశారు. అనతంరం ఆలయం బయట భారత వ్యతిరేక, ఖలిస్తాన్ అనుకూల పోస్టర్లు వేశారు. అందులో ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ మరణంలో భారత పాత్రపై కెనడా దర్యాప్తు చేస్తోందని పేర్కొన్నారు.
ఉదయం పోస్టర్లను గుర్తించిన ఆలయ అధికారులు ఆ పోస్టర్లను వెంటనే తొలగించారు. ఆలయాన్ని అపవిత్రం చేయడం పట్ల తాను దిగ్భ్రాంతికి గురయ్యానని ఆలయ అధ్యక్షుడు సతీష్ కుమార్ అన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన వెల్లడించారు. మాస్కులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఆలయ ఆవరణలో సంచరించిన వీడియో సీసీ టీవీ పుటేజ్ లో రికార్డు అయిందన్నారు.
ఈ ఘటనపై చర్చించేందుకు ఆదివారం బోర్డు కమిటీ సమావేశం కానున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని 2015లో ప్రధాని మోడీ సందర్శించారు. గతంలో కూడా సర్రెలో ఇలాంటి పోస్టర్లు వెలిశాయి. అగస్టు1న వాంకోవర్ లోని ఇండియన్ కాన్య్సూలేట్ బిల్డింగ్ హౌస్ బయట ఖలిస్తాన్ పోస్టర్లు వెలిశాయి. ఇక కెనడాలో ఆలయంపై దాడి జరగడం ఇది నాలగవ సారి.
ఈ ఏడాది ఏప్రిల్ లో ఒంటారియాలోని స్వామి నారాయణ్ ఆలయంపై దాడి జరిగింది. అంతకు ముందు ఫిబ్రవరిలో కెనడాలోని రామ మందిర్, జనవరిలో బ్రాంప్టన్ ఆలయంపై ఖలీస్తాన్ ఉగ్రవాదులు దాడులు చేశారు. ఆలయంపై భారత వ్యతిరేక రాతలు రాశారు. కెనడాలో వరుసగా ఆలయాలపై జరుగుతున్న దాడుల పట్ల భారత ప్రభుత్వం ఆ:దోళన వ్యక్తం చేస్తోంది.