AP: ఈనెల 16న వైసీపీ అసెంబ్లీ, లోక్ సభ అభ్యర్థుల జాబితాను సీఎం జగన్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే ఫైనల్ చేసినట్లు తెలుస్తుండగా.. మార్చి 16న ఇడుపులపాయలో అభ్యర్థుల పేర్లను జగన్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఇడుపులపాయలో రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించి, అదే రోజు ఇచ్చాపురంలో ఎన్నికల ప్రచారాన్ని జగన్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
మళ్లీ అదే ప్రాంతం నుంచి..
2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్ట్‌ను ఆయన ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. 16వ తేదీ నాటి ప్రకటన అనంతరం సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలోకి దిగుతారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నుంచి సిద్ధం గర్జనతో ఎన్నికల శంఖారావం పూరించిన సీఎం జగన్.. మళ్లీ అదే ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి ఈ నెల 18వ తేదీన ప్రచారం మొదలుపెడతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Kadiyam Srihari: కేసీఆర్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి?
ఒకటి రెండు మార్పులు..
ఇక ఇచ్ఛాపురం నుంచి మొదలుపెట్టి అదేరోజు విజయవాడ వెస్ట్, నెల్లూరు రూరల్‌లో ఆయన ప్రచారంలో పాల్గొనచ్చని తెలుస్తోంది. ఇక ఒకటి రెండు మార్పులతో సమన్వయకర్తల చివరి జాబితాను సైతం సిద్ధం చేసినట్లు సమాచారం. ఒకట్రెండు రోజుల్లో ఆఖరి జాబితా విడుదల కానుందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇక.. ఇప్పటివరకు విడుదలైన జాబితాల వారీగా చూస్తే 77 అసెంబ్లీ స్థానాలకు, 23 పార్లమెంట్ స్థానాలకు ఇన్‌ఛార్జిలను నియమించింది వైసీపీ అధిష్టానం.