Anna Hazare Comments On Arvind Kejriwal Arrest: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన తర్వాత విపక్షాలు మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రారంభించాయి. లోక్‌సభ ఎన్నికల వేళ (Lok Sabha Elections) ఆప్‌కి బీజేపీ భయపడి కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిందని అసలు ఇది స్కామే కాదని విమర్శలు గుప్పిస్తు్న్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకు కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని చెబుతున్నారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుపై సామాజిక కార్యకర్త అన్నా హజారే షాకింగ్ కామెంట్స్ చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఈ విధంగా మద్యం పాలసీ (Liquor Policy) అమలు చేయడంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇదంతా ఆయన సొంత పనుల కారణంగానే జరిగిందని విమర్శించారు.
'నాతో కలిసి పనిచేసి, మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు లిక్కర్ పాలసీలో అవినీతి చేస్తున్నందుకు తాను చాలా బాధపడ్డాను. ఆయన చేష్టల వల్లే ఆయన అరెస్ట్.. అయితే ఏం చేస్తాడు.. అధికారం ముందు ఏదీ పనికిరాదు. అరెస్టు జరిగింది, ఇప్పుడు చట్టం ప్రకారం ఏది జరుగుతుందో అదే జరుగుతుంది.' అని అన్నా హజారే చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి వ్యతిరేకంగా అన్నా ఉద్యమంలో చేరారు.
ఆయన 2012లో తన సొంత రాజకీయ పార్టీని స్థాపించారు. నవంబర్ 26న ఆమ్ ఆద్మీ పార్టీ ని స్థాపించారు. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి తొలిసారిగా 70 స్థానాలకు గానూ 28 స్థానాల్లో విజయం సాధించింది. కేజ్రీవాల్ మొదటిసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈ ప్రభుత్వం 49 రోజులు మాత్రమే కొనసాగింది. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి 70 సీట్లకు 67 వచ్చాయి. బంపర్ విజయం తర్వాత కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు.
Also Read: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ!