World Cup 2023 BAN vs SL: ఢిల్లీ వేదికగా బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య పోరులో ‘టైమ్డ్ అవుట్’ (Timed Out) ఘటన జరిగింది. ఇందులో విచిత్రంగా శ్రీలంక సీనియర్ బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ అవుట్ అయ్యాడు. శ్రీలంక బ్యాటింగ్ సమయంలో సమరవిక్రమ అవుటైన తర్వాత మాథ్యూస్ క్రీజులోకి వెళ్లాడు. అయితే అదే సమయంలో అతని హెల్మెట్ పట్టి విరిగిపోయింది. దీంతో దాన్ని రిప్లేస్ కోసం మాథ్యూస్ వెయిట్ చేశాడు. సమయం మూడు నిమిషాలు మించిపోయింది. దీన్ని అదనుగా తీసుకుని బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ (Shakib) ఔట్‌కు అప్పీల్ చేశాడు. నిబంధనల ప్రకారం అంపైర్ అవుట్‌గా ప్రకటించాడు. ఈ విషయంపై ఆలోచించుకోవాల్సిందిగా మాథ్యూస్ బంగ్లాను కోరినా షకీబ్ రూల్ ఈజ్ రూల్.. ‘విత్ ఇన్ ది రూల్స్’ అని సమాధానం చెప్పాడు.
Also Read: ఐఆర్ఆర్ కేసులో బాబు మధ్యంతర బెయిల్ పై విచారణ వాయిదా
అయితే మథ్యూస్ (Angelo Mathews) దీని మీద మండిపడుతున్నాడు. తనకు అన్యాయంగా టైమ్డ్ అవుట్ ఇచ్చారని అంటున్నాడు. తనకు ఇంకా సమయం ఉండగానే అవుట్ అని ప్రకటించారని వాపోయాడు. తానేమీ తప్పు చేయలేదని...రెండు నిమిషాల్లోపే బ్యాంటింగ్‌కు వచ్చానని చెబుతున్నాడు. అంపైర్ల కామన్ సెన్స్ ఏమైందో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు మాథ్యూస్. షకీబ్, బంగ్లా జట్టు కూడా అవమానకరంగా ప్రవర్తించారని అన్నాడు. ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. అవతలి వారి ప్రవర్తనను బట్టే మన ప్రవర్తన ఉంటుంది. వాళ్ళు మాకు చేసిన దానికి మేము మ్యాచ్ అయిన తరువాత కరచాలనం చేయలేదు. దాంతో పోల్చుకుంటే మేము చేసింది చాలా చిన్న విషయం అంటున్నాడు మాథ్యూస్. నా పదిహేనేళ్ళ కెరీర్ లో ఇంతలా దిగజారిన జట్టును ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు. తనకు ఇంకా టైమ్ మిగిలే ఉందని అనడానికి ఆధారంగా వీడియోలు తమన దగ్గర ఉన్నాయని, వాటిని తప్పకుండా బయటపెడతానని అంటున్నాడు మాథ్యూస్.
మరోవైపు ఇదే విషయం మీద బంగ్లా కెప్టెన్ షకీబ్ కూడా స్పందించాడు. టైమ్డ్ ఔట్‌కు అప్పీల్ చేయడం తప్పో ఒప్పో నాకు తెలీదు. కానీ నేను యుద్ధంలో ఉన్నాను. అందులో గెలవడం కోసం ఏమైనా చేయాలనిపించింది అంటున్నాడు షకీబ్. దీని మీద చర్చ సాగుతూనే ఉంటుంది. దానికి నేనేమీ సమాధానం చెప్పదలుచుకోలేదు. మా టీమ్ బౌలర్ వచ్చి నాకు టైమ్డ్ అవుట్ గురించి చెప్పాడు. నేను అంపైర్ కు వెళ్ళి అడిగా. ఆయన సీరియస్‌గానే అప్పీల్ చేస్తున్నావా అని అడిగారు. నేను యెస్ అన్నాను. దీని తర్వాత మా జట్టు బ్యాటింగ్‌లోనూ రాణించింది. దీనికి టౌమ్డ్ అవుట్ నిర్ణయం కూడా దోహదపడిందని అంగీకరిస్తా అంటున్నాడు షకీబ్.