/rtv/media/media_files/2025/11/13/air-pollution-2025-11-13-09-55-57.jpg)
Air Pollution
Air Pollution: ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా విశాఖపట్నంలో(Visakhapatnam) గాలి కాలుష్యం రోజురోజుకూ పెరుగుతోంది. ఇది కేవలం ఊహ కాదు, ఇటీవల బయటకు వచ్చిన గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఈ కాలుష్యం వల్ల నగర వాసులు శ్వాస సమస్యలు, దగ్గు, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఇది ఒక్క విశాఖకే పరిమితం కాదు. శ్రీకాకుళం, అనకాపల్లి ప్రాంతాల్లో కూడా గాలి నాణ్యత తగ్గుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. చల్లని వాతావరణం మొదలైనప్పటి నుంచి గాలిలోని దుమ్ము, పొగ కిందికి చేరి నేలమీదే ఎక్కువసేపు ఉండిపోవడం వల్ల ప్రజలు వాటిని శ్వాసలోకి తీసుకుంటున్నారు. వైద్యులు చెబుతున్నట్టు, ఈ పరిస్థితి ఊపిరితిత్తులకు హానికరం.
విశాఖలో డేంజర్ బెల్స్!! (Vizag Air Pollution)
ఇది కొత్త సమస్య కాదు. సంవత్సరాల క్రితమే ఉత్తరాంధ్రలో ఫార్మా, కెమికల్ పరిశ్రమలు వేగంగా పెరిగాయి. మొదట్లో ఇవి హైదరాబాద్ పరిసరాల్లో ఉండేవి. తర్వాత అవి విశాఖ-శ్రీకాకుళం ప్రాంతాలకు తరలాయి. పరిశ్రమల వ్యర్థాలు సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్ల గాలి, నీటి కాలుష్యం పెరిగింది. ప్రజలు బస్సుల్లో ప్రయాణించే సమయంలో కూడా పరిశ్రమలు దాటేటపుడు ముక్కులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చేది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అనకాపల్లి వద్ద ఏర్పాటైన ఫార్మా సిటీతో ఈ ప్రాంతంలో మరిన్ని కంపెనీలు స్థాపించారు. పరిశ్రమలు అభివృద్ధికి సంకేతం అయినప్పటికీ, వాటి కారణంగా పర్యావరణం క్రమంగా దెబ్బతింటోంది. ఇప్పుడు అదే ప్రభావం గాలి నాణ్యతపై స్పష్టంగా కనిపిస్తోంది.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, విశాఖలో గాలి నాణ్యత సూచీ (AQI) గత వారం కంటే గణనీయంగా పెరిగింది. ఇది “మోడరేట్ టు పూర్” స్థాయిలో ఉందని చెబుతున్నారు. ఇది ముఖ్యంగా శ్వాసకోశ లేదా గుండె సంబంధిత సమస్యలున్న వారికి ప్రమాదకరం.
వైద్య నిపుణులు చెబుతున్నట్టు చలి ఎక్కువగా ఉన్న రోజుల్లో సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండటం మంచిది. బయటకు వెళ్లాల్సి వస్తే, నాణ్యమైన మాస్క్ ధరించాలి. ఆస్థమా లేదా ఊపిరితిత్తుల సమస్యలున్నవారు ఇన్హేలర్‌లు క్రమం తప్పకుండా వాడాలి. అలాగే ధూమపానం పూర్తిగా మానుకోవడం అత్యవసరం.
నిపుణులు సూచనల ప్రకారం, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు సంవత్సరానికి ఒకసారి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, ఐదేళ్లకొకసారి న్యుమోకాకల్ వ్యాక్సిన్ తీసుకోవాలి.
మొత్తానికి, విశాఖలో పెరుగుతున్న కాలుష్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పరిశ్రమలు, ప్రభుత్వం, ప్రజలు అందరూ కలసి చర్యలు తీసుకుంటేనే గాలి నాణ్యతను కాపాడుకోవచ్చు.
Follow Us