Vijayawada Floods: తొమ్మిది రోజులుగా వరద నీళ్లలో ఉన్న విజయవాడ ప్రజలు ఇప్పుడిప్పుడే ఊపిరి తీసుకుంటున్నారు. వరద క్రమేపీ తగ్గుముఖం పట్టడంతో సాధారణ జీవితం వైపు ప్రయాణం మొదలు పెడుతున్నారు. వరద ప్రాంతాల్లో ప్రజల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ఇళ్లలో నీళ్లు చేరి అన్ని వస్తువులు పాడైపోయాయి. మరోవైపు వాహనాలు పూర్తిగా దెబ్బతిని స్టార్ట్ కాక నిరుపయోగంగా మారిపోయాయి. అందరికీ, అన్ని వస్తువులకూ ఇన్సూరెన్స్ ఉండదు. పాడయినా వస్తువులను రిపేరు చేయించుకోవాలన్నా వేల ఖర్చు. అంతేకాకుండా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఎలా ప్రయత్నించాలనే విషయం తెలీని పరిస్థితి. వరదల నుంచి బయటపడుతున్న ప్రజల ముందున్న పెద్ద సమస్యలివి.
ప్రభుత్వం ప్రజల ఈ తక్షణ సమస్యలపై దృష్టి సారించింది. ప్రజలు మరింత ఇబ్బంది పడకుండా.. ఇళ్ల దగ్గరే అవసమైన సహాయం అందించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరదల్లో ఇబ్బందులు పడ్డ ప్రతి ఒక్కరికీ సహాయం అందుతుందని చెప్పారు. పాడైన వస్తువులను వారి ఇంటి వద్దే మెకానిక్ వచ్చి రిపేర్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు.
కాలనీల్లో బైక్ రిపేర్..
కాలనీల్లో నాలుగైదు చోట్ల మెకానిక్ లను అందుబాటులో ఉంచి బైక్ లు రిపేరు చేయించే ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం ఈ మేరకు వరద పీడిత ప్రాంతాల్లో ఇప్పటికే మెకానిక్స్ వాహనాలను రిపేరు చేయడం మొదలు పెట్టారు.
ఇంటి వద్దనే ఎలక్ట్రిక్ వస్తువుల మరామత్తులు..
ఇళ్లకే ఎలక్ట్రీషియన్, ప్లంబర్, వడ్రంగి, ఎలక్ట్రిక్ వస్తువులు బాగుచేయడానికి ఆయా కంపెనీల వారు వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఇంట్లో పాడైన వస్తువు ఏ కంపెనీకి సంబంధించినదో ఆ కంపెనీ మెకానిక్ ఇంటికే వచ్చి ఆ వస్తువును రిపేర్ చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. దీనికోసం అర్బన్ కంపెనీ యాప్ సహాయం తీసుకుంటున్నారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహకారంతో యాప్ బాధితుల ఫోన్ లో ఇంస్టాల్ చేసి సర్వీస్ రిక్వస్ట్ ఇప్పించడం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అర్బన్ కంపెనీకి స్కిల్ డెవలప్మెంట్ విభాగం నుంచి 400 మంది టెక్నీషియన్లను ఈ పనుల కోసం కేటాయిస్తున్నారు.
ఇన్సూరెన్స్..
Vijayawada Floods: ఇన్సూరెన్స్ విషయానికి వస్తే.. వాహనాల ఇన్సూరెన్స్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. పూర్తి ఇన్సూరెన్స్ పొందాలంటే పాడైన వాహనాలకు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అయితే, చాలా మంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. అటువంటి వారికి ఇన్సూరెన్స్ రికవరీ కష్టం కావచ్చు. అటువంటి వారికి ఏవిధంగా సహాయం చేయవచ్చు అనే విషయంపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవచ్చు. ఇక ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం కోసం సహకరించడానికి ప్రత్యేకంగా ఇన్సూరెన్స్ కంపెనీలు కాలనీల్లో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాయి. ఆ క్యాంపుల్లో ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అవసరమైన సహాయం అందిస్తున్నారు.
మొత్తమ్మీద వరదబాధితులు త్వరగా ఈ పీడకల నుంచి బయటపడేలా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలన్నిటినీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వస్తున్నారు.