Tirupati: తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీపై దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న వేళ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలకు నందిని ఆవు నెయ్యి పంపించే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ అధికారులు ట్యాంకర్లకు జీపీఎస్, ఎలక్ట్రిక్ లాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఎలక్ట్రిక్ లాకింగ్ సిస్టమ్ వల్ల దారిలో ఎవరూ ట్యాంకర్‌ను తెరవలేరని, టీటీడీ అధికారులు ఓటీపీ ఎంటర్ చేస్తేనే లాక్ తెరుచుకుంటుందని వెల్లడించారు. అయితే నెల రోజుల క్రితమే టీటీడీకి నెయ్యి సరఫరాను పునరుద్ధరించామని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ పేర్కొంది.
ఇదిలా ఉంటే.. తిరుపతి లడ్డూ అమ్మకాల్లో రూ. 500 కోట్ల స్కాం జరిగిందని జనసేనపార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ ఆరోపించారు. వైసీపీ నేతలు తిరుమల పవిత్రతను మంటగలిపారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు లడ్డూ వ్యవహారం బయటకు వచ్చి ఉంటే జగన్ ఘోరంగా ఓడిపోయేవాడని అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన కిరణ్ రాయల్.. లడ్డూను కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. జగన్, వై.వి.సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తప్పు చేయకుండా ఉంటే తిరుమలకు రావాలంటూ సవాల్ విసిరారు.
రేపు తిరుమలలో జరుగనున్న యాగంలో జగన్ బృందం పాల్గొనాలి. వై.వి.సుబ్బారెడ్డి, జగన్, ధర్మారెడ్డిలు తిరుమలకు వచ్చి తలనీలాలు సమర్పించాలి. వైసీపీ హయాంలో వందల కోట్ల స్కాం జరిగింది. లడ్డూ వ్యవహారంలో అరెస్టులు జరిగేంత వరకు వెనక్కి తగ్గేది లేదు. సినీనటుడు ప్రకాష్ రాజ్ నాస్తికుడు. లడ్డూ గురించి మరోసారి ప్రకాష్ రాజ్ మాట్లాడితే నాలుక కోస్తాం. రోజా, పెద్దిరెడ్డి టిక్కెట్ల బాగోతం బయటపడింది. మంత్రి హోదాలో రోజుకు వెయ్యి టిక్కెట్లను అమ్ముకున్నారు. రోజా, పెద్దిరెడ్డిలు జైలుకెళ్లడం ఖాయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.