మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ వివాదం, తిరుపతిలో పోలీసుల ఆంక్షలు, వైసీపీ నేతల ముందస్తు అరెస్టుల నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది సేపట్లో జగన్ ప్రెస్ మీట్ నిర్వహించి తన తిరుపతి పర్యటన రద్దుకు గల కారణాలను వివరించే అవకాశం ఉందని సమాచారం. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేసి ఆలయ ప్రతిష్టను దెబ్బ తీశాడని జగన్ ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారంరోజున పూజల్లో పాల్గొనాలని ఈ నెల 25న జగన్ పిలుపునిచ్చారు. అదే రోజు తాను తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటానని తెలిపారు.
తిరుపతిలో ఆంక్షలు
అయితే.. జగన్ ఈ ప్రకటన చేసిన నాటి నుంచి కూటమి నేతల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. తిరుపతిలో ఆంక్షలు విధిస్తున్నట్లు నిన్న ఎస్పీ ప్రకటించారు. అనుమతులు లేకుండా సభలు, నిరసనలు, ర్యాలీలు చేపడితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. తిరుపతికి వెళ్తే జగన్ తప్పకుండా డిక్లరేషన్ సమర్పించాల్సిందేని బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి ట్విట్టర్ ద్వారా స్పష్టం చేశారు. దీంతో కూటమి నేతలు ఇదే అంశాన్ని డిమాండ్ చేశారు.
మరో వైపు ఈ రోజు ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్, ముందస్తు అరెస్టులు చేశారు. కొద్ది సేపటి క్రితం చంద్రబాబు సైతం పరోక్షంగా జగన్ ను ఉద్ధేశిస్తూ ట్వీట్ చేశారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ తన టూర్ ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.