తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుబ్రహ్మణ్యస్వామి, వై.వి.సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ నిర్వహించింది. జస్టిస్ బి.ఆర్.గవాయి, కె.వి.విశ్వానాథన్ బెంచ్ ఈ పిటిషన్ పై మధ్యాహ్నం 3.30 గంటలకు విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా విచారణ కొనసాగించాలా? లేదా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్‌కు ఈ అంశాన్ని అప్పగించాలా? అనే అంశంపై ఈ రోజు ధర్మాసనం తీర్పు ఇస్తుందని అంతా భావించారు.
నిర్ణయం చెప్పని కేంద్రం..
కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం పరిశీలించి అనంతరం న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. అయితే.. కేంద్ర నిర్ణయం తెలపడానికి సమయం కావాలన్న సొలిసిటర్ జనరల్ న్యాయస్థానాన్ని కోరారు. దీంతో రేపు ఉదయం 10.30 గంటలకు విచారణను వాయిదా వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ అంశంపై 4 రోజుల క్రితం విచారణ జరిగింది. అయితే.. తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలు లేవన్న సుప్రీంకోర్టు ఆ సమయంలో వ్యాఖ్యానించింది.
ఆగిన సిట్ విచారణ..
ఇదిలా ఉంటే లడ్డూ కల్తీ అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణను ఆపేసింది. సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సిట్ విచారణను తాత్కాలికంగా ఆపుతున్నట్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు.