Tirumala: తిరుమలలో మల్టీ లెవల్ కార్ పార్కింగ్‌కు టీటీడీ ప్రణాళిక

తిరుమలలో రథసప్తమి వేడుకలు టీటీడీ, జిల్లా యంత్రాంగం, పోలీసుల సమన్వయంతో ఘనంగా జరిగాయి. రికార్డు స్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు వాహన సేవలు దర్శించారు. భక్తుల రద్దీ దృష్ట్యా మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లు టీటీడీ తెలిపింది.

New Update
Tirumala

Tirumala

Tirumala: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu) ఆదేశాల మేరకు ఈ ఏడాది జనవరి 25న తిరుమలలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టీటీడీ, జిల్లా యంత్రాంగం, పోలీసు శాఖ, ఏపీఎస్ ఆర్టీసీ, శ్రీవారి సేవకులు కలిసి సమన్వయంతో పనిచేయడం వల్ల వేడుకలు విజయవంతమయ్యాయని చెప్పారు.

రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహణ

రథసప్తమి వేడుకలు సజావుగా ముగియడంతో మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, టీటీడీ భక్తులకు కల్పిస్తున్న సదుపాయాల వల్ల గతంలో ఎన్నడూ లేనంతగా భక్తులు తిరుమలకు వస్తున్నారని అన్నారు. భక్తుల అనుభవాలు, వారి సూచనలను ఆధారంగా తీసుకుని మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Tirumala Multi Level Car Parking

తిరుమలలో పెరుగుతున్న వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని త్వరలోనే మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అలాగే రాంభగీచా ప్రాంతంలో భక్తుల తోపులాటలు జరగకుండా భవిష్యత్తులో పటిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. రథసప్తమి రోజున నిర్విరామంగా సేవలందించిన అర్చక స్వాములు, వాహన బేరర్లు, శ్రీవారి సేవకులకు ఈవో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు శాఖతో కలిసి విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1800 మంది పోలీసులు, 1414 మంది విజిలెన్స్ సిబ్బంది, 150 మంది ట్రాఫిక్ సిబ్బంది సేవలందించారు. జిల్లా ఎస్పీతో పాటు పోలీసు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.

ఈసారి లగేజీ కేంద్రాల్లో 3.56 లక్షల గ్యాడ్జెట్లు, బ్యాగులు డిపాజిట్ అయ్యాయని, ఇది గత ఏడాదితో పోలిస్తే 73 శాతం ఎక్కువని తెలిపారు. తిరుపతి నుంచి తిరుమలకు 1932 బస్సు ట్రిప్పుల్లో 60,425 మంది భక్తులు వెళ్లగా, తిరుమల నుంచి తిరుపతికి 1942 ట్రిప్పుల్లో 82,241 మంది భక్తులు ప్రయాణించారు.

భక్తులకు విస్తృత సౌకర్యాలు

రథసప్తమి సందర్భంగా తిరుమలలో చేసిన విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు భక్తులను బాగా ఆకట్టుకున్నాయని చెప్పారు. శ్రీవారి వాహన సేవల సమయంలో భక్తుల వినోదార్థం సుమారు 1000 మంది కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యం కోసం మాడ వీధుల్లో ప్రత్యేక పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపట్టామని, ఇందుకోసం అదనంగా 590 మంది పారిశుద్ధ్య సిబ్బంది పనిచేశారని తెలిపారు.

రికార్డు స్థాయిలో భక్తుల హాజరు

అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ, వాట్సాప్, ఐవీఆర్ఎస్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల అభిప్రాయాలు సేకరించామని, చాలా మంది టీటీడీ ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారని చెప్పారు. ఉత్తరమాడ వీధిలో ఒక్క భక్తుడు కూడా సదుపాయాలపై అసంతృప్తి వ్యక్తం చేయకపోవడం టీటీడీ కృషికి నిదర్శనమన్నారు.

ఈ ఏడాది రథసప్తమి సందర్భంగా రికార్డు స్థాయిలో 3.45 లక్షల మంది భక్తులు మాడ వీధుల్లో వాహన సేవలను దర్శించుకున్నారు. భక్తులకు 9.42 లక్షల మందికి అన్నప్రసాదాలు, 6.30 లక్షల మందికి పానీయాలు, 2.90 లక్షల మందికి పాలు, 2.15 లక్షల మందికి నీటి బాటిళ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ సేవల కోసం సుమారు 220 మంది శ్రీవారి సేవకులు పనిచేశారు. మీడియా సమావేశంలో టీటీడీ సీవీఎస్‌వో మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు