/rtv/media/media_files/2026/02/03/cm-2026-02-03-19-17-38.jpg)
ఏపీ ఆక్వా రంగానికి అమెరికా ప్రభుత్వం పెద్ద ఊరటనిచ్చింది. భారతీయ సముద్ర ఆహార ఎగుమతులపై ఇప్పటివరకు ఉన్న 25 శాతం టారిఫ్‌ను 18 శాతానికి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామంపై రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆనందం వ్యక్తం చేశారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం మన రాష్ట్ర ఎగుమతిదారులకు, ముఖ్యంగా రొయ్యల రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో 25 శాతం టారిఫ్‌తో పాటు ఇతర అదనపు పన్నులు కలిపి మొత్తం 50 నుంచి 58 శాతం వరకు భారం పడేది. దీనివల్ల 2025 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. ఎగుమతుల పరిమాణం 15 శాతం తగ్గి 2.01 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. ఎగుమతుల విలువ 6.3 శాతం తగ్గి 1.72 బిలియన్ డాలర్లకు పరిమితమైంది.ముఖ్యంగా ఫ్రోజెన్ ష్రింప్ (ఘనీభవించిన రొయ్యల) వ్యాపారం తీవ్రంగా దెబ్బతిందన్నారు.
ఇప్పుడు టారిఫ్ 18 శాతానికి తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు మళ్ళీ గిరాకీ పెరగనుంది. నిలిచిపోయిన కొత్త ఆర్డర్లు మళ్ళీ రావడం మొదలయ్యాయి.రాబోయే నెలల్లో ఎగుమతులు 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.గతంలో 5 శాతానికి పడిపోయిన ప్రాసెసర్ల లాభాలు, ఇప్పుడు మళ్ళీ 7 నుంచి 8 శాతానికి చేరుతాయని అంచనా వేశారు.
రైతులకు ఆదాయం స్థిరంగా
దేశంలోనే సముద్ర ఆహార ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని మత్స్యకారులు, ఆక్వా రైతులకు ఆదాయం స్థిరంగా ఉంటుందని మంత్రి తెలిపారు. అలాగే కేంద్ర బడ్జెట్-2026లో ప్రాసెసింగ్ రంగానికి ఇచ్చిన రాయితీలు కూడా తోడవ్వడం ఈ రంగానికి అదనపు బలాన్ని ఇస్తుందన్నారు.
అమెరికాతో పాటు చైనా, రష్యా, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలకు కూడా మన ఎగుమతులు స్థిరంగా సాగుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. మొత్తానికి ఈ ఏడాది దేశవ్యాప్తంగా సముద్ర ఆహార ఎగుమతులు 14-15 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుతాయని MPEDA అంచనా వేస్తోంది.
Follow Us