/rtv/media/media_files/2025/10/30/tirumala-2025-10-30-21-22-43.jpg)
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి సరఫరా కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కీలక మలుపు తిరిగింది. ఈ కేసు వెనుక భారీ కుట్ర దాగి ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.ఈ కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరించిన కడూరు చిన్న అప్పన్నను సిట్ అధికారులు అరెస్టు చేశారు. రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తిని అరెస్టు చేయడం ఈ కేసులో ఇదే మొదటిసారి.
ప్రతి కిలో నెయ్యిపై రూ. 25 కమీషన్
వైద్య పరీక్షల అనంతరం అప్పన్నను నెల్లూరులోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సిట్ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కల్తీ నెయ్యి సరఫరా వెనుక జరిగిన కుట్ర కోణాలను ప్రధానంగా ప్రస్తావించారు. 2022లో నెయ్యి సరఫరా చేసే భోలేబాబా డెయిరీ యాజమాన్యాన్ని అప్పన్న సంప్రదించారు. ప్రతి కిలో నెయ్యిపై రూ. 25 కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డెయిరీ యజమాన్యం కమీషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో, ఆ డెయిరీపై అనర్హత వేటు వేయించడానికి అప్పన్న కుట్రకు పాల్పడినట్లు సిట్ గుర్తించింది.
డెయిరీని తనిఖీ చేయాలని టీటీడీ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ మొత్తం వ్యవహారంలో చిన్న అప్పన్నకు సుమారు రూ. 50 లక్షల వరకు ముడుపులు అందినట్లు సిట్ తన విచారణలో గుర్తించింది. అప్పన్న బ్యాంక్ లావాదేవీలను పరిశీలించడం ద్వారా ఈ అక్రమాలను నిగ్గు తేల్చినట్లు రిపోర్టులో పేర్కొంది. సిట్ దర్యాప్తులో తేలిన అంశాల ఆధారంగా, చిన్న అప్పన్నను ఈ కేసులో 24వ నిందితుడిగా చేర్చారు. కేసులో ఉన్న కుట్ర కోణాన్ని పూర్తిగా ఛేదించడానికి, చిన్న అప్పన్నను కస్టడీకి అప్పగించాలని సిట్ అధికారులు కోర్టును కోరే అవకాశం ఉంది. ఈ విచారణ ద్వారా మరికొంత మంది నిందితుల ప్రమేయం కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు తెలిపారు.
/rtv/media/member_avatars/2025/05/07/2025-05-07t015022634z-vamshi.jpg )
 Follow Us
 Follow Us