/rtv/media/media_files/2026/01/25/gun-fire-2026-01-25-09-09-12.jpg)
నంద్యాల జిల్లా డోన్ రైల్వే పోలీస్ స్టేషన్ లో ఆదివారం ఉదయం ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. డ్యూటీ ముగించుకుని తిరిగి వచ్చిన ఒక హెడ్ కానిస్టేబుల్ తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పోలీస్ శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది.
హుబ్లీ నుంచి విజయవాడ వెళ్లే రైలులో
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లా సి.బెలగల్ గ్రామానికి చెందిన పెద్దయ్య డోన్ రైల్వే పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. శనివారం రాత్రి హుబ్లీ నుంచి విజయవాడ వెళ్లే రైలులో భద్రతా డ్యూటీ ముగించుకుని ఆదివారం ఉదయం డోన్ స్టేషన్‌కు చేరుకున్నారు. డ్యూటీ ముగిసిన తర్వాత తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను స్టేషన్‌లో అప్పగించే క్రమంలో ప్రమాదవశాత్తు అది మిస్ ఫైర్ అయ్యింది.
ఈ ప్రమాదంలో బుల్లెట్ నేరుగా పెద్దయ్య శరీరంలోకి దూసుకుపోవడంతో ఆయన తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పెద్దయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు. ఆయన మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Follow Us