Jethwani :
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో ఇద్దరు పోలీసు అధికారుల పై వేటు పడింది. అప్పుడు ఈ కేసును దర్యాప్తు చేసిన ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ, విజయవాడ పశ్చిమ జోన్ ఏసీపీ కె.హనుమంతరావును సస్పెండ్ చేస్తూ డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేసిన ఫిర్యాదుపై అప్పటి ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ కేసు నమోదు చేసినట్లు సమాచారం.
ఆయన ఈ కేసుకు దర్యాప్తు అధికారిగా వ్యవహరించారు. ప్రస్తుతం గవర్నరుపేట ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. నెల రోజులుగా కాదంబరి జెత్వానీ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ముంబై నుంచి విజయవాడకు వచ్చిన కాదంబరితో పాటు ఆమె తండ్రి నరేంద్రకుమార్ జెత్వానీ, తల్లి ఆశా జెత్వానీ నుంచి పోలీసులు వాంగ్మూలం స్వీకరించారు. విచారణ చేయడానికి ప్రత్యేకాధికారిగా క్రైమ్స్ ఏసీపీ స్రవంతి రాయ్‌ను ఏపీ ప్రభుత్వం నియమించింది. రెండు రోజుల పాటు కాదంబరి కుటుంబ సభ్యులు ఆమెకు వాంగ్మూలం వినిపించారు.
అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఆదేశాలతో నాటి విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా, డీసీపీ విశాల్‌గున్నీ ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా కేసు నమోదు చేయించారని కాదంబరి వాంగ్మూలంలో తెలిపారు. తన అరెస్టు చేయడానికి విశాల్‌గున్నీ నేరుగా ముంబై వచ్చారని ఆరోపించారు.
పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌కు మేలు చేయడానికి తనపై అక్రమంగా తప్పుడు కేసు పెట్టినట్లు విజయవాడలో పోలీసు అధికారులకు తెలిపారు. శుక్రవారం రాత్రి కాదంబరి జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు మరోసారి ఫిర్యాదు అందించారు. తనపై అక్రమంగా కేసు నమోదు చేయించిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్, సహకరించిన ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీపై ఫిర్యాదు చేశారు. ఇప్పటికే వారిపై కేసు నమోదు చేయాలని ఆమె కుటుంబం పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం కాదంబరి మహిళా సంఘాలతో కలిసి సీపీని కలిసిన విషయం తెలిసిందే.
తాజాగా తన న్యాయవాదులతో కాదంబరి, ఆమె తండ్రి నరేంద్రకుమార్, తల్లి ఆశా జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. న్యాయనిపుణులతో చర్చించి కేసు నమోదు చేస్తామని ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కాదంబరి ఫిర్యాదు అందిస్తుండగానే ఈ కేసుకు సంబంధించి అప్పటి ఇబ్రహీంపట్నం ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణను, పశ్చిమ జోన్ ఏసీపీ హనుమంతరావు ను సస్పెండ్ చేశారు. కాదంబరి వ్యవహారంలో మరో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఒక ఎస్‌ఐ పాత్ర ఉన్నట్టు అధికారులు నిర్థారించారు.