/rtv/media/media_files/2024/11/09/ZsEgjdqCE0r5ClhYTJ5s.jpg)
తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని YCP ప్రభుత్వంపై హోం మంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి స్థాపించిన రిక్రూట్‌మెంట్ బోర్డు సైతం కల్తీమయమని ఆమె ఎద్దేవా చేశారు. టాయిలెట్ క్లీనింగ్‌కు వాడే ‘లబ్సా’ అనే రసాయనం వాడి మహా అపచారానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని కేవలం ఆరోపణలు మాత్రమే కాదు, నాలుగు కీలకమైన నివేదికలు స్పష్టం చేస్తున్నాయని మంత్రి తెలిపారు. అయితే ఈ లబ్సా కెమికల్ ప్రమాదకరమా అనే సందేహాలు చాలామందిలో వస్తున్నాయి. ఈ పేరు కూడా ఇప్పటివరకు వినడం తక్కువే.
లబ్సా రసాయనం..
ఇది ఒక సింథటిక్ డిటర్జెంట్ ఏజెంట్. దీనిని ప్రధానంగా లాండ్రీ డిటర్జెంట్లు, డిష్ వాషింగ్ లిక్విడ్స్, టాయిలెట్ క్లీనర్ల తయారీలో శుభ్రపరిచే గుణం కోసం ఉపయోగిస్తారు. మానవ వినియోగానికి లేదా ఆహార పదార్థాల్లో వాడితే ఇది చాలా ప్రమాదకరమైనది. ఇది అత్యంత గాఢత కలిగిన యాసిడ్. చర్మం లేదా కళ్ళ మీద పడితే తీవ్రమైన మంట, గాయాలు అవుతాయి. ఇది ఆహార పదార్థాల్లో అస్సలు వాడకూడని పదార్థం. ఇది కడుపులోకి వెళ్తే జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతింటుంది, తీవ్రమైన వాంతులు, విరేచనాలు, కడుపులో అంతర్గత గాయాలకు దారి తీస్తుంది.
ఇది పారిశ్రామిక అవసరాల కోసం ఉద్దేశించినది కాబట్టి, దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలోని అవయవాలపై విషప్రభావం చూపుతుంది. దీన్ని నేరుగా తాకడం లేదా పీల్చడం వల్ల శ్వాసకోశ ఇబ్బందులు కూడా కలగవచ్చు. అందుకే దీనిని వాడే పరిశ్రమల్లో కార్మికులు చేతికి గ్లౌజులు, మాస్కులు ధరిస్తారు. రాజకీయంగా తిరుమల లడ్డూలో దీనిని వాడారని వస్తున్న ఆరోపణలు నిజమైతే, అది భక్తుల ఆరోగ్యంతో ఆడుకోవడమే కాకుండా, పవిత్రమైన ప్రసాదాన్ని పూర్తిగా కలుషితం చేసినట్లు అవుతుంది.
హోంమంత్రి అనిత నాలుగు నివేదికల్లో లడ్డూ కల్తీ జరిగిందని చెప్పారు.
సీఎఫ్‌టీఆర్‌ఐ: ఈ నివేదిక 2022లో వైకాపా అధికారంలో ఉన్నప్పుడే వచ్చిందని ఆమె గుర్తు చేశారు.
ఎన్‌డీడీబీ, సిట్ : ఈ సంస్థల నివేదికలు కూడా నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని తేల్చాయి.
NDRI: జంతు కొవ్వును గుర్తించే సామర్థ్యం తమ వద్ద లేదని ఎన్‌డీఆర్‌ఐ చెబితే, దానిని వక్రీకరిస్తూ జంతు కొవ్వు లేదని వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు.
Follow Us