Jagan: ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన తిరుపతి లడ్డూ వివాదంపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చంద్రబాబు తిరుపతి లడ్డూతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని అన్నారు. ఎన్నికల సమయంలో అమలు కానీ హామీలను అవలీలగా చేస్తామని కాకమ్మ కబుర్లు చెప్పి.. అధికారంలోకి వచ్చిన తరువాత హామీల గురించి అడిగితే ఊసే ఎత్తడం లేదని ఫైర్ అయ్యారు.
దేవుడిని వాడుకుంటున్నాడు..
తిరుమలలో నెయ్యి కల్తీ అంటూ సీఎం చంద్రబాబు డైవెర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు జగన్. రాజకీయాల కోసం దేవుడిని కూడా వాడుకునే వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. నెయ్యి కి బదులు జంతువుల కొవ్వుతో లడ్డూ తాయారు చేశారంటూ.. సీఎంగా ఉన్న వ్యక్తి మాట్లాడడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సబబేనా? అని నిలదీశారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు అల్లుకున్న కట్టుకథలు ఇవి అని ఫైర్ అయ్యారు. ప్రతీ 6 నెలలకు ఓసారి నెయ్యి సరఫరా కోసం టెండర్లు పిలుస్తారన్నారు. నెయ్యి నాణ్యత నిర్ధారణ పరీక్షను ఎవరూ మార్చలేదని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా జరుగుతున్న పద్ధతుల్లోనే తిరుమలలో లడ్డూ తయారీ జరిగిందన్నారు .
చేసిందంతా మోసమే...
చంద్రబాబుది 100 రోజుల పాలన కాదు.. 100 రోజుల మోసం అని విమర్శలు గుప్పించారు జగన్. 100 రోజుల్లో సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెనూ లేదు అని ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ అంటూ ప్రజల జీవితాలతో ఆటలాడారని మండిపడ్డారు. ఈ 100 రోజుల్లో చంద్రబాబు చేసిందంతా మోసమే అని నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనమే అన్నారు. ఇప్పటివరకు విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు ఇవ్వలేదన్నారు. స్కూళ్లన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయని ఫైర్ అయ్యారు. గోరు ముద్ద గాలికెగిరిపోయిందని సీఎం చంద్రబాబుపై జగన్ సెటైర్లు వేశారు.