ఏపీ పాలిటిక్స్‌లో పుష్పరాజ్ రప్పా రప్పా డైలాగ్ అగ్గి రాజేసింది. సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ , మాజీ సీఎం జగన్ నోట రప్పా రప్పా అంటూ పలికిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్‌కు డిప్యూటీ సీఎం పవన్ వార్నింగ్ ఇచ్చారు. సినిమా డైలాగులు సినిమా హాలు వరకే బాగుంటాయని అన్నారు. వాటిని అనుసరిస్తామంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదని, ఎవరైనా చట్టం, నియమ నిబంధనలను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించే అసాంఘిక శక్తులపై.. పోలీసులు కఠినంగా ఉండాలని పవన్ సూచించారు.
కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు
గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పవన్ ఈ కామెంట్స్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిని కూటమి ప్రభుత్వం ఉపేక్షించదని పవన్ హెచ్చరించారు. రౌడీషీట్లు తెరిచి అసాంఘిక శక్తులను అదుపు చేస్తామన్నారు. చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తామని బహిరంగంగా ప్రదర్శనలు చేసేవారిని కట్టడి చేయాలన్నారు. కట్టడి చేయకపోగా సమర్థించేలా మాట్లాడేవారి నేర ఆలోచనను ప్రజలంతా గమనించాలని పవన్ కోరారు. అసాంఘిక శక్తులకు మద్దతుగా మాట్లాడటం కూడా నేరమే అన్న విషయాన్ని మరచిపోవద్దని పవన్ సూచించారు.