Cyclone : ఏపీకి తుపాను ముప్పు.. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం

ఏపీకి మరోసారి తుపాను ప్రమాదం పొంచి ఉంది.. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశముందని వివరించింది.

New Update
571374605_1413667966785993_2753261331888614521_n

Cyclone

Cyclone :  ఏపీకి మరోసారి తుపాను ప్రమాదం పొంచి ఉంది.. శనివారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశముందని వివరించింది. ఆ తర్వాత ఇది  నైరుతి బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని నిపుణుల అంచనా వేస్తున్నారు.

 ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారం ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్ర, శని, ఆదివారాల్లో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు, మంగళవారం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది.

మరోవైపు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. ఏజెన్సీ ప్రాంత ప్రజలు చలితో గజగజలాడిపోతున్నారు. మంగళవారం రాత్రి అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో 4.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యల్పం కావడం గమనార్హం. అదే జిల్లాలోని ముంచంగిపుట్టులో 5.8, చింతపల్లిలో 6.8, డుంబ్రిగుడలో 7.8, పాడేరు, పెదబయలులో 8.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పార్వతీపురం మన్యం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, ఎన్టీఆర్‌ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల లోపే నమోదయ్యాయి.తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. గురువారం తెలంగాణలో చలిగాలులు వీచే అకాకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

Advertisment
తాజా కథనాలు