MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబు కేసులో బిగ్ ట్విస్ట్..భార్య లక్ష్మీదుర్గతో కలసి జంప్

ఎమ్మెల్సీ అనంతబాబు..గత నాలుగురోజులుగా తెలుగురాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరిది. ఏకంగా డ్రైవర్ ని హత్య చేసి.. డెడ్ బాడీని వాళ్ల ఇంటికే డోర్ డెలివరీ చేసి జైలు పాలయ్యాడు. అయితే ఇప్పుడు తనతోపాటు భార్య లక్ష్మీదుర్గ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం సంచలనంగా మారింది.

New Update
FotoJet (33)

MLC Ananthababu

 MLC Ananthababu : ఎమ్మెల్సీ అనంతబాబు.. గత నాలుగురోజులుగా తెలుగురాష్ట్రాల్లో మార్మోగుతున్న పేరిది. ఏకంగా డ్రైవర్ ని హత్య చేసి.. డెడ్ బాడీని వాళ్ల ఇంటికే డోర్ డెలివరీ చేసి జైలు పాలయ్యాడు. అయితే ఇప్పుడు తనతోపాటు భార్య లక్ష్మీదుర్గ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం పొలిటికల్‌ సర్కిల్స్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. 2022లో జరిగిన ఈ ఘటన మళ్లీ ఇప్పుడు ఎందుకు రాజుకుంది...జనాల దృష్టిలో నాడు క్లోజ్‌ అయిన ఈ ఫైల్‌...నేడు మళ్లీ ఎందుకు తెరుచుకుంది..ఈ వివరాల్లోకి వెళ్లేముందు అసలు అనంతబాబు ఎవరు...అతని పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ ఏంటన్నదానిపై ఇప్పుడోసారి నిశితంగా చూద్దాం...

47 ఏళ్ల అనంతబాబు.. తక్కువ టైమ్‌లోనే ఎమ్మెల్సీ స్థాయికి చేరుకున్నాడు. దానికంటే ముందు డీసీసీబీ ఛైర్మన్ గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓ వెలుగు వెలిగాడు. మారేడుమిల్లి అడవుల్లో.. రంపచోడవరం ఏజెన్సీలో తెలుగు వీరప్పన్ గా  ముద్రపడ్డాడు. అయితే ఇదంతా గతం. మన్యంలో ఉండి అతను ఏం చేసినా..ఎంతగా చెలరేగిపోయినా.. ఎన్ని అరాచకాలు చేసినా అది కొండకోనల్లో కాబట్టి అతడికి సాగిపోయింది. కానీ అడవిని దాటి మైదానంలో చేసిన హత్య ఇప్పుడు అనంతబాబు జీవితాన్నే మార్చేసింది. ఎంతలా అంటే...అనంతబాబు రాజకీయ సమాధికి ఈ హత్య నిలువెత్తు సాక్ష్యమనే చెప్పుకోవచ్చు. ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్న కేసులో సెక్షన్ 302 కింద అరెస్ట్ అయిన తొలి ఎమ్మెల్సీ గా రికార్డులకెక్కాడు అనంతబాబు. 

అనంతబాబు తండ్రి అనంత చక్రరావు అడ్డతీగల సమితి అధ్యక్షుడిగా పని చేశాడు. అమాయక గిరిజనులే చక్రరావు టార్గెట్‌. వాళ్లని బానిసలుగా చేసుకుని ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు. ఆదివాసీ భూములను కబ్జా చేశాడు.. ఇతని అరాచకాలపై గురిపెట్టిన నక్సల్స్‌ 1986లో చక్రరావును కాల్చి చంపారు. 

తన తండ్రి ఆదివాసీ అని అనంతబాబు చెప్పుకుంటాడు. కానీ కాపు కులానికి చెందిన మాజీ మంత్రి జ్యోతుల నెహ్రూ సోదరిని…చక్రరావు వివాహం చేసుకున్నాడు. అయితే తల్లి కాపు అయినప్పటికీ తండ్రి కులమే తనదనేది అనంతబాబు వాదన. అందుకే అనంతబాబు ST అభ్యర్థిగా జెడ్పీటీసీకి ఎన్నికయ్యారు. ఇది కూడా అప్పట్లో వివాదాస్పదమయింది.. అటు మరో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు సైతం అనంతబాబుకు మేనమామే..ఇటు జ్యోతుల నెహ్రూ అటు వరుపుల సుబ్బారావుకు ముద్దుల మేనల్లుడు అనంతబాబనే టాక్‌ ఉంది. నాడు టీడీపీలో కొనసాగిన అనంతబాబు కాలక్రమేనా జగన్ చెంతన చేరాడు.

తండ్రి వారసత్వంగా రంపచోడవరం,అడ్డతీగల ప్రాంతాలను అడ్డాగా చేసుకున్న అనంతబాబు ఫొటో, బ్యానర్‌లేని ఏజెన్సీ గ్రామం అంటూ ఉండదు. అక్కడ గిరిజన కుర్రకారు ఫోన్లలో సైతం అనంతబాబు ఫొటోనే స్క్రీన్ సేవర్‌గా ఉండటం నిజంగా ఆశ్చర్యం. ఏజెన్సీలో చాలామంది యువతకు స్పోర్ట్స్‌ కిట్స్‌ అనంతబాబు ఉచితంగా పంపిణీ చేయడమే దీనికి కారణమంటారు అతని కహానీ పూర్తిగా తెలిసినవాళ్లు. ఏజెన్సీలో జరిగే సంతల్లో, బొంగు చికెన్ అమ్మే షాపుల ముందు అతని బ్యానర్ ఉండాల్సిందే. నాడు రాజకీయంగా ఏ పోస్టులోనూ లేకపోయినా మన్యంలో అనంతబాబు క్రేజ్‌ అలాంటిది మరి. ఇక, ఏజెన్సీలో మావోయిస్టుల అలజడి తగ్గిపోయాక కలప స్మగ్లింగ్‌తో తెలుగు వీరప్పన్‌గా అవతారమెత్తాడు అనంతబాబు. అటవీ ఉత్పత్తుల ఎగుమతులు, రంగురాళ్ల వ్యాపారం ఇలా ఒకటేంటి... అడవిలో దొరికే అన్ని వస్తువలకు ఆయనే ఓనర్..ఆయనే జమీందార్..ఆయనపై రౌడీషీట్ నమోదైతే నాడు తన అధికారపార్టీ వైసీపీ హయాంలో ఎత్తేయించుకున్నాడనే ఆరోపణలూ ఉన్నాయి. అనంతబాబు పొలిటికల్‌ కెరీర్‌లో ఇదంతా నాణేనికి ఒకవైపుగా చూడొచ్చు.

అయితే 2022, మేలో సొంత డ్రైవర్‌ను చంపేసిన కేసు అటు అనంతబాబునే కాదు ఇటు వైసీపీని కూడా చిక్కుల్లో పడేసేలా చేసింది. ఎమ్మెల్సీ రహస్యాలు తెలిసే డ్రైవర్‌ సుబ్రహ్మణ్యంను అనంతబాబు చంపేశాడని ఆరోపణలు ఉన్నా..వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంపైనే హత్యచేశానంటూ నాడు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. తాను ఒక్కడినే డ్రైవర్‌ను చంపానని చెప్పిన అనంతబాబు వాంగ్మూలం అబద్ధమని తేలింది. కేసు పునర్‌విచారణ కోసం ప్రత్యేకంగా సిట్‌ ఏర్పాటు చేసిన ప్రస్తుత కూటమి సర్కార్‌...భర్త అనంతబాబు దారుణంలో భార్య లక్ష్మీదుర్గ పాత్ర కూడా ఉందని తేల్చింది. సీసీ ఫుటేజ్‌, కాల్ డేటా ఆధారంగా లక్ష్మీదుర్గను  ఏ-2గా చేర్చారు పోలీసులు. అంతేకాదు విచారణ నిమిత్తం రావాలని ఆమెకు నోటీసులు జారీచేయడంతో హైకోర్టులో ముందస్తు బెయిల్‌పిటిషన్ దాఖలు చేసి పరారీ అయిపోయారు. కాగా, ఓ వైపు మండలి సమావేశం జరుగుతుండగా ఉన్నపళంగా ఫోన్లు స్విచాఫ్‌ చేసి, కనీసం గన్‌మన్లకు కూడా చెప్పకుండా అనంతబాబు సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లో తీవ్ర  చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు