Rain Alert: గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి ఒడిస్సా- ఉత్తరకోస్తా సమీపంలోని గోపాల్ పూర్ తీరం దాటే అవకాశం ఉంది. ఈ వాయుగుండం ప్రభావం వల్ల ఉత్తర కోస్తాంధ్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఆ జిల్లాలకు అలెర్ట్
తీర ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. 25 సెం.మీ వర్ష పాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉన్న పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. ఏలూరు, ఎన్టీఆర్, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కావున ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో తప్పా బయటకు రాకపోవడం మంచిదని సూచించింది.
కృష్ణ, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతి పురం మన్యం, పశ్చిమ గోదావరి, కోనసీమ, జిల్లాకు అరేంజ్ అలెర్ట్ జారీ చేసింది. అలాగే నంద్యాల, కర్నూల్, కడప, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రాబోయే ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ఈరోజు కూడా కొన్ని చోట్ల అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చే ప్రమాదం ఉంది. కావున అక్కడ నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని , సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.
వాయుగుండం నేపథ్యంలో మత్సకారుల ఎట్టిపరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. అలాగే నదులు, వాగుల దగ్గర ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఈరోజు ఏపీలో పలు జిల్లాల్లోని స్కూల్స్ కి కూడా సెలవు ప్రకటించారు.
కృష్ణ, గోదావరిలకు వరద ప్రవాహం
భారీ వర్షాల కారణంగా గోదావరి, కృష్ణ నదులకు వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణ నదికి వరద తాకిడి ఎక్కువైంది. ఉదయం 3.25 లక్షల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం ఉండగా.. మధ్యాహ్నం లోగా 5 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభావిత జిల్లాల్లోని అధికారులు అప్రమత్తం అయ్యారు. అలాగే ప్రజలను కూడా అలెర్ట్ చేశారు. ప్రభావిత ప్రాంతాల్లోకి వరద నీరు రాకుండా తగిన చర్యలు చేపట్టారు. మరోవైపు గోదావరి నది కూడా ఉగ్రరూపం దాల్చింది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.5 అడుగులకు చేరింది. దీంతో అక్కడి నుంచి 8.23 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.
Also Read: Heavy Rains: ముంబయికి రెడ్ అలెర్ట్ .. 250 కి పైగా విమానాలు రద్దు?