BREAKING: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. సోషల్ మీడియా బ్యాన్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించే దిశగా ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఆస్ట్రేలియా అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేస్తామని రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ దావోస్‌లో వెల్లడించారు. 

New Update
BREAKING

BREAKING

ప్రస్తుతం పిల్లలు సోషల్ మీడియాకు బానిసలవుతుండటం, సైబర్ బుల్లీయింగ్ వంటి ప్రమాదాల బారిన పడుతుండటంపై ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల మానసిక ఆరోగ్యం, సేఫ్టీ కాపాడేందుకు 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. స్విట్జర్లాండ్‌ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఐటీ మంత్రి నారా లోకేష్ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. "ఒక రాష్ట్రంగా మేము ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 'అండర్-16' చట్టాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నాము. చిన్న వయసులో పిల్లలకు సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్‌ను విశ్లేషించే పరిణతి ఉండదు. అందుకే ఒక బలమైన చట్టపరమైన నిబంధనను తీసుకురావాల్సిన అవసరం ఉందని మేము నమ్ముతున్నాము" అని ఆయన పేర్కొన్నారు.

ఆస్ట్రేలియా ప్రభుత్వం డిసెంబర్ 10, 2025 నుండి ఒక చారిత్రాత్మక చట్టాన్ని అమలులోకి తెచ్చింది. 16 ఏళ్లలోపు పిల్లలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఎక్స్ (ట్విట్టర్), స్నాప్‌చాట్ వంటి ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించడం నిషేధం. పిల్లలు సోషల్ మీడియా అకౌంట్లు తెరవకుండా నియంత్రించాల్సిన బాధ్యత పూర్తిగా ఆయా సోషల్ మీడియా సంస్థలదే. నిబంధనలు ఉల్లంఘిస్తే టెక్ దిగ్గజాలకు వేల కోట్ల రూపాయల జరిమానా విధించేలా ఆస్ట్రేలియా చట్టాన్ని రూపొందించింది.

ఏపీ ప్రభుత్వం ముందున్న సవాళ్లు

ఈ నిర్ణయం పిల్లల భవిష్యత్తుకు మంచిదే అయినప్పటికీ, దీని అమలులో కొన్ని చట్టపరమైన, సాంకేతిక సవాళ్లు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అంశంపై జాతీయ స్థాయిలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, ఇటీవల మద్రాస్ హైకోర్టు కూడా ఆస్ట్రేలియా తరహా చట్టాన్ని భారత్‌లో తేవాలని సూచించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం నిషేధమే కాకుండా, విద్యా వ్యవస్థలో డిజిటల్ అక్షరాస్యతను పెంచడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం ద్వారా పిల్లలను ఆన్‌లైన్ ప్రమాదాల నుండి రక్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, రాష్ట్రంలో ఈ చట్టం అమలు చేసే సాధ్యసాధ్యాలపై ఒక నివేదికను రూపొందించాలని ఐటీ శాఖ యోచిస్తోంది.

అదేబాటలో ఈ దేశాలు..

ప్రపంచంలోనే మొదటిసారి ఈ రూల్స్ అమలు చేసిన దేశం ఆస్ట్రేలియా. డిసెంబర్ 10, 2025 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 2026లో మలేషియా కూడా ఈ రూల్ తీసుకురావాలని చూస్తోంది. 2026 సంవత్సరం నుండి 16 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. ఫ్రాన్స్‌లో కూడా ఇది ప్రతిపాదన దశలో ఉంది. అక్కడి ప్రభుత్వం 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే దిశగా చట్టాన్ని రూపొందిస్తోంది. ఇది సెప్టెంబర్ 2026 నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఫ్రాన్స్‌లో 15 ఏళ్ల లోపు వారు సోషల్ మీడియా వాడాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి అనే నిబంధన ఉంది.

చైనా: ఇక్కడ 'మైనర్ మోడ్' ఉంది. 8-15 ఏళ్ల వారు రోజుకు 1 గంట మాత్రమే వాడాలి. రాత్రి 10 నుండి ఉదయం 6 వరకు సోషల్ మీడియా వాడకంపై నిషేధం ఉంది.

స్పెయిన్: సోషల్ మీడియా అకౌంట్ తెరవడానికి కనీస వయస్సును 14 నుండి 16 ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది.

డెన్మార్క్: 15 ఏళ్ల లోపు వారికి నిషేధం విధించాలని యోచిస్తోంది.

నార్వే: 15 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను పరిమితం చేయాలని చూస్తోంది.

అమెరికా: ఫ్లోరిడా వంటి కొన్ని రాష్ట్రాలు 14 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించే చట్టాలను తెచ్చాయి.

Advertisment
తాజా కథనాలు