APSRTC: పండగల సీజన్ మొదలైపోయింది. దీంతో స్కూళ్ల కు సెలవులు వచ్చేస్తున్నాయి. ఎప్పుడెప్పుడు సొంతూర్లకు వెళ్దామా అని ఎదురు చూసే వారు ముందుగానే రైళ్లకు, బస్సులకు టికెట్లు బుక్ చేసుకునేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ సమయంలో బస్సుల్లో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఈ సమయంలో బస్సుల సంఖ్య పెంచడం, టికెట్ ధరలు పెంపు, తగ్గింపులు సాధారణమే.
ఈ క్రమంలోనే 10 శాతం రాయితీ అందిస్తూ ఏపీఎస్‌ఆర్టీసీ డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సులు ప్రయాణికులకు ఓ శుభవార్తను చెప్పింది. విజయవాడ టు హైదరాబాద్, బెంగళూరు నడుపుతున్న ఏపీఎస్ ఆర్టీసీ డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 5 వరకు ఆదివారం , శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో టిక్కెట్ ఛార్జీలపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణాధికారి ఎం.వై దానం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు అమరావతి, డాల్ఫిన్ క్రూయిజ్ బస్సుల్లో ఎంజీబీఎస్‌కు ఆదివారం సాధారణ ఛార్జీ రూ. 770 ఉండగా, మిగిలిన రోజుల్లో 700 రూపాయలు, తదుపరి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం సాధారణ ఛార్జీ 830 రూపాయలు ఉండగా మిగిలిన రోజుల్లో రూ. 750గా నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.అమరావతి మల్టీ యాక్సిల్ బస్సుల్లో ఆదివారం మెజిస్టిక్ బస్టేషన్ వరకు సాధారణ ఛార్జీ రూ.1870, మిగిలిన రోజుల్లో రూ.1700, ఆపై ప్రాంతాలకు ఆదివారం సాధారణ ఛార్జీ 1930, మిగిలిన రోజుల్లో రూ. 1750 గా రాయితీ కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.
హైదరాబాద్ టు విజయవాడ : హైదరాబాద్ టు విజయవాడ జర్నీ చేసేవారికి శుక్రవారం రోజు సాధారణ ఛార్జీ, మిగిలిన రోజుల్లో రాయితీ ఛార్జీ వసూలు చేస్తారు. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే వెన్నెల స్లీపర్ ఏసీ బస్సుల్లో ఆదివారం మెజిస్టెక్ బస్ స్టేషన్ వరకు సాధారణ ఛార్జీ రూ. 2,170 ఉండగా, మిగిలిన రోజుల్లో 1970, ఆపై ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆదివారం రూ. 2210, మిగిలిన రోజుల్లో రూ. 2010 గా ఉంటుందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Also Read: తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వర్షాలే...వర్షాలు!