Andhra Pradesh: రివర్స్ అటాక్.. జగన్‌ అక్రమాస్తుల కేసులపై ప్రతిపక్షాలు ఫోకస్‌..

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుస కేసులు పెడుతుండటంతో.. జగన్‌ను అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమైనట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగా ఆయా పార్టీలకు చెందిన పలువురు నేతలు సీఎం జగన్‌పై ఉన్న కేసులను మళ్లీ తెరపైకి తెస్తున్నారు.

New Update
Andhra Pradesh: రివర్స్ అటాక్.. జగన్‌ అక్రమాస్తుల కేసులపై ప్రతిపక్షాలు ఫోకస్‌..

Andhra Pradesh: టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం, ఏపీ సీఐడీ(AP CID) కేసుల మీద కేసులు పెడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చంద్రబాబుకు (Chandrababu) మద్ధతు తెలుపుతున్నాయి. కేవలం మద్ధతు మాత్రమే కాదు.. కన్నుకు కన్ను అనే సామెతలాగా జగన్‌ రూటులో వెళ్తూ రివర్స్‌ ఎటాక్‌ చేస్తున్నాయి. అందుకోసం పదేళ్లుగా విచారణ నత్తనడకన సాగుతున్న జగన్‌ కేసులను మళ్లీ ఫోకస్‌లోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే న్యాయస్థానాలు వేదికగా గత కొద్ది రోజులుగా పలు వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

మూకుమ్మడిగా రివర్స్‌ దాడి..

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ వరుస కేసులు పెడుతోంది. ఇప్పటికే స్కిల్‌ కేసులో ఆయన 53 రోజులు రిమాండ్‌ ఖైదీగా జైలులో ఉండాల్సి వచ్చింది. దీంతో ప్రతిపక్ష నేత పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుని పరిస్థితి, ప్రతిపక్ష పార్టీల్లోని నేతలు, కార్యకర్తల పరిస్థితి ఏంటన్న ఆందోళన అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే జగన్ దూకుడు అడ్డుకునే వ్యూహాన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి కట్టుగా అమలు చేస్తున్నట్లు కనబడుతోంది. ఇందులో భాగంగా ఆయా పార్టీలకు చెందిన పలువురు నేతలు సీఎం జగన్‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను మళ్లీ తెరపైకి తెస్తున్నారు. మొదటగా ఈ వ్యూహాన్ని అమలు చేసింది వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణం రాజు అయితే, దాన్ని కొనసాగిస్తూ బీజేపీ ఏపీ చీఫ్‌ పురంధేశ్వరి, జనసేన కీలక నేత హరిరామ జోగయ్యలు పావులు కదిపారు.

సుప్రీంకోర్టులో రఘురామ పిటిషన్‌..

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ ఏకంగా సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసి వైసీపీకి ఝలక్‌ ఇచ్చారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ తో పాటు దర్యాప్తు సంస్ధ సీబీఐకి కూడా సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు నానాటికీ ఆలస్యమవుతోందని, తెలంగాణ హైకోర్టు పర్యవేక్షణలో ఉన్న ఈ కేసు విచారణ ముందుకు సాగకుండా జగన్ తో పాటు ఇతర నిందితులు వందల కొద్దీ డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని రఘురామ తన పిటిషన్ లో ఆరోపించారు. అలాగే ఈ కేసును విచారిస్తున్న హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇప్పటికే 3 వేల సార్లు వాయిదా వేసిందని కూడా పేర్కొన్నారు. అలాగే జగన్ కేసుల్ని తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టును రఘురామ విజ్ఞప్తి చేశారు.

హైకోర్టులో రఘురామ మరో పిటిషన్‌..

ఏపీలో వైసీపీ ప్రభుత్వం, సీఎం వైఎస్ జగన్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ రఘురామకృష్ణంరాజు హైకోర్టులోనూ పిటిషన్‌ వేశారు. ఏపీలో వైసీపీ సర్కార్ నడుపుతున్న సీఎం వైఎస్ జగన్ తన నిర్ణయాలతో ఆయన బంధువులు, వివిధ కంపెనీలకు కోట్ల రూపాయల అనుచిత లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని, వీటిపై సీబీఐతో విచారణ జరిపించాలంటూ రఘురామ హైకోర్టులో ఈ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు.

సీజేఐకి పురంధేశ్వరి లేఖ..

ఇక సీఎం జగన్‌తో పాటూ ఆయా కేసుల్లో సహ నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కూడా టార్గెట్‌ చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ బీజేపీ చీఫ్‌ పురంధేశ్వరి లేఖ రాయడం ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. విజ‌య సాయి రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్ప‌డుతున్నాడ‌ని, గ‌త 10 ఏళ్లుగా బెయిల్ మీద కొన‌సాగుతున్నార‌ని లేఖలో పురంధేశ్వరి ఆరోపించారు. ఆయ‌న అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేస్తూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. అలాగే ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సైతం బెయిల్ మీద సుదీర్ఘ కాలం కొన‌సాగ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు పురంధేశ్వరి. నేరారోప‌ణ‌లు ఉన్న వారు ఎలా ప‌ద‌వుల‌లో కొన‌సాగుతార‌ని, అందుకే వారిని వెంట‌నే తొల‌గించేలా ఆదేశించాల‌ని సీజేఐని కోరారు. న్యాయ వ్య‌వ‌స్థ‌లోని విధాన ప‌ర‌మైన అంత‌రాల‌ను అన్నింటిని ప‌దే ప‌దే వాడుకుంటూ విచార‌ణ‌లు వాయిదా వేస్తూ వ‌స్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మొత్తం వ్యవ‌హారంపై జ‌గ‌న్, విజ‌య సాయి రెడ్డిపై చ‌ర్యలు తీసుకోవాల‌ని సీజేఐనికోరారు పురందేశ్వరి.

టీఎస్‌ హైకోర్టులో హరిరామజోగయ్య పిల్‌..

ఇక జనసేన సైతం జగన్‌ కేసులనే టార్గెట్‌ చేసింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ఈ అంశంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సీబీఐ కోర్టులో జగన్‌ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని కోర్టును కోరారు. ఏపీ సీఎం జగన్‌పై నమోదైన సీబీఐ, ఈడీ కేసులను 2024 ఎన్నికల్లోగా తేల్చేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు ధర్మాసం ఎట్టకేలకు దీన్ని పిల్‌గా పరిగణిస్తూ విచారణకు స్వీకరించింది. అంతేకాదు, ప్రతివాదులుగా జగన్‌, సీబీఐ, సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది.

Also Read:

బరువు తగ్గడానికి బ్రౌన్ రైస్ మంచిదా? వైట్ రైస్ మంచిదా?

నేనూ సీఎం అభ్యర్థినే.. మనసులోని మాట చెప్పేసిన మధుయాష్కి..

Advertisment
తాజా కథనాలు