Andhra Pradesh High Court Trial on TTD Metla Margam Fencing Petition: తిరుపతి: అలిపిరి నుంచి తిరుమల వరకు నడక దారిలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనే పిటిషన్ పై బుధవారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు వి చారణ జరిగింది. టీటీడీ మాజీ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు.. తిరుమల కాలిబాటలో వచ్చే భక్తులకు రక్షణ కల్పించాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. అటవీ శాఖ, తిరుమల తిరుపతి దేవాస్థానం అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకున్నారనే అంశంపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఇటీవల చిరుత దాడిలో మరణించిన బాలిక లక్షిత కుటుంబానికి మరో రూ.15 లక్షలు ఆర్థిక సహాయం ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. భక్తులకు ఏటువంటి అసౌకర్యం కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొంది హైకోర్టు.
అండర్ పాస్ ఏర్పాటు చేయాలి: లాయర్ బాలాజీ యల మంజుల
పులుల నుంచి భక్తులకు రక్షణ కల్పించపోగా టీటీడీ కర్రలు ఇవ్వటం హాస్యాస్పదమని లాయర్ బాలాజీ యలమంజుల వాదించారు. మెట్ల మార్గంలో అవసరమైన చోట జంతువులు వెళ్ళటానికి అండర్ పాస్ ఏర్పాటు చేయటానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఏడాది మూడు ఘటనలు జరిగినా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని పిటిషనర్ న్యాయవాది బాలాజీ యల మంజుల వాదనలు వినిపించారు.
ఎట్టకేలకు చిక్కిన చిరుత:
కాగా సోమవారం అలిపిరి కాలినడక మార్గంలో నాలుగో చిరుత బోనులో చిక్కింది. ఎట్టకేలకు అనేక వ్యయప్రయాసాల అనంతరం నాలుగో చిరుత చిక్కింది. ఆగష్టు 15నే ఈ నాలుగో చిరుత సంచారాన్ని అటవీశాఖ గుర్తించింది. ఆగష్టు 15 నుంచి నిరంతరంగా ఆపరేషన్ చిరుత కొనసాగించారు. ఇక నాలుగో చిరుత కూడా చిక్కడంతో నేటితో నడకమార్గంలో సంచరిస్తున్న చిరుతల బెడదకు చెక్ పడిందని అంతా భావిస్తున్నారు. ఆదివారం రాత్రి అలిపిరి కాలినడక మార్గంలో 7వ మైలు రాయి దగ్గర చిరుతపులి బోనులో చిక్కింది. దీంతో.. ఆపరేషన్ చిరుత విజయవంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు.
లక్షిత మృతి తర్వాత అప్రమత్తమైన అధికారులు:
తిరుమలలో చిరుతల సంచారం గతంలో ఉన్నా ఈ నెల 11న ఆరేళ్ల చిన్నారి లక్షిత మృతి చెందిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. లక్షిత మృతి తర్వాత అన్నివైపుల నుంచి టీటీడీపై అనేక విమర్శలు వచ్చాయి. అంతకముందు కూడా కౌశిక్ అనే బాలుడిని చిరుత గాయాలు పాలు చేయడం టీటీడీపై విమర్శల దాడి పెరగడానికి ప్రధాన కారణం. ఇలా వరుస పెట్టి ఘటనలు జరుగుతుండడంతో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
500 సీసీ కెమెరాలు ఏర్పాలు:
అటవీ శాఖ శిక్షణ పొందిన సిబ్బందితో బోనులను ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ మార్గంలో గాలి గోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు దాదాపు 500 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కొండపై ఉన్న ఆలయానికి పిల్లలతో ట్రెక్కింగ్ చేసే తల్లిదండ్రులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ సంస్థ విజ్ఞప్తి చేసింది.
ఇది కూడా చదవండి: పల్నాటి యుద్ధం.. ఎంపీ vs ఎమ్మెల్యే