Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం భద్రత కోసం మోహరించిన ఎస్‌ఎస్‌ఎఫ్ జవాన్ కాల్పుల్లో మరణించాడు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున 5.25 గంటలకు చోటుచేసుకుంది. ఆ సైనికుడి పేరు శత్రుఘ్న విశ్వకర్మ. 25 ఏళ్ల శతృఘ్న అంబేద్కర్ నగర్ నివాసి. ఉదయం రామమందిరం కాంప్లెక్స్‌లో కాల్పుల శబ్ధం వినిపించడంతో తోటి భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అక్కడ శతృఘ్న రక్తపు మడుగులో పడి ఉండడం చూశారు. తుపాకీ తూటా తగిలినట్లు గమయించారు. తోటి సైనికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇక్కడి నుంచి గాయపడిన సైనికుడిని ట్రామా సెంటర్‌కు తరలించారు. అయితే అక్కడి వైద్యులు అతడు చనిపోయినట్లు నిర్ధారించారు.
Ayodhya Ram Mandir: సైనికుడి మృతితో అయోధ్య ఆలయ ప్రాంగణంలో కలకలం రేగింది. సంఘటనా స్థలానికి ఐజీ, ఎస్పీలు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని వారు స్వయంగా పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించింది. ప్రాథమిక విచారణలో ఆత్మహత్యగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రిపోర్టు వచ్చిన తర్వాత మృతికి అసలు కారణం తేలనుంది.
కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబం..
శత్రుఘ్న విశ్వకర్మ 2019 బ్యాచ్‌కి చెందినవాడు. అతను అంబేద్కర్ నగర్‌లోని సమ్మన్‌పూర్ పోలీస్ స్టేషన్‌లోని కాజ్‌పురా గ్రామంలో నివాసి. SSFలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆలయ భద్రత కోసం యోగి ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం SSF దళాన్ని ఏర్పాటు చేసింది. ఘటనకు ముందు శత్రుఘ్న మొబైల్ చూస్తున్నాడని మృతుడి సహోద్యోగులు తెలిపారు. అయితే, అతను కూడా కొన్ని రోజులుగా ఏదో ఆందోళనలో ఉన్నట్టు కనిపించేవాడని తోటి సిబ్బంది చెబుతున్నారు. పోలీసులు అతని మొబైల్‌ను కూడా విచారణ కోసం స్వాధీనం చేసుకున్నారు. మృతుడి కుటుంబీకులకు పోలీసులు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శతృఘ్న ఈ లోకంలో లేడని కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
మూడు నెలల క్రితం కూడా
మూడు నెలల క్రితం కూడా రామమందిరం భద్రత కోసం మోహరించిన ఓ సైనికుడి దగ్గర తుపాకీ పెళ్లి ప్రమాదం జరిగింది. ఆ సందర్భంలో, సైనికుడు స్వయంగా తన రైఫిల్‌ను శుభ్రం చేస్తున్నపుడు అది పొరపాటున పేలింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.