Amit shah on Manipur: మణిపూర్‌లో అల్లర్లకు అసలు కారణాలు చెప్పిన అమిత్ షా.. ఏం చెప్పారంటే? మణిపూర్ సీఎంను మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు హొంమంత్రి అమిత్‌షా. మణిపూర్ అల్లర్లపై విపక్షాల ప్రశ్నలకు లోక్‌సభలో సమాధానం ఇచ్చారు. మణిపూర్ అల్లర్లకు అసలు కారణాలేంటో వివరించే ప్రయత్నం చేశారు. మియన్మార్ సరిహద్దులో మనకు ఫెన్సింగ్ లేదని.. మిజోరాం, మణిపూర్‌లో కుకీలు శరణార్థులుగా వచ్చారన్నారు. ఏప్రిల్‌లో మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. మూడో తేదిన ఓ ఘటన జరిగింది. అప్పటి నుంచి మణిపూర్‌లో అశాంతి నెలకొందన్నారు. By Trinath 09 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి ఇప్పుడు మణిపూర్ పేరు వింటేనే.. హత్యలు, అత్యాచారాలు గుర్తుకొస్తున్నాయి. హింసతో రాష్ట్రం అట్టుడుకుతోంది. ప్రశాంతంగా ఉండాల్సిన కొండ ప్రాంతం ఎందుకు ఇలా తయారైంది.. ఈ హింసకు కారణం ఎవరు.. అసలు మణిపూర్‌లో అలర్లకు అసలు కారణాలేంటనే అనుమానాలు సామాన్య ప్రజల్లో తలెత్తుతున్నాయి. అటు బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా మణిపూర్ విషయంలో బీజేపీపై విమర్శల దాడిని పెంచాయి. మణిపూర్ అంశమే ప్రధాన ఎజెండాగా ప్రస్తుతం పార్లమెంట్ అట్టుడుకిపోతోంది. హోంమంత్రి అమిత్ మణిపూర్ ఘటనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్ అల్లర్లకు అసలు కారణాలేంటో వివరించే ప్రయత్నం చేశారు. అమిత్ షా చెప్పిన కారణాలు: మణిపూర్‌లో ఆరేళ్లుగా బీజేపీ అధికారంలో ఉందని.. ఆరేళ్లలో ఒక్క రోజు కూడా కర్ఫ్యూ విధించలేదన్నారు అమిత్ షా. ఒక్క రోజు కూడా బంద్ చేయలేదని.. ఇది బీజేపీ ఆరేళ్ల పాలన చరిత్ర అని చెప్పారు. 2011లో మియన్మార్‌లో మిలిటరీ పాలన వచ్చిందని. ప్రజాస్వామ్య ప్రభుత్వం పడిపోయిందన్నారు. అక్కడ కుకీ డెమొక్రటిక్ ఫ్రంట్ ఉందని గుర్తు చేశారు. ఆ పార్టీ ప్రజాస్వామ్యం కోసం ఆందోళన ఉద్ధృతం చేసిందన్నారు అమిత్ షా. దీంతో అక్కడి మిలటరీ ప్రభుత్వం వారిపై ఉక్కుపాదం మోపిందని తెలిపారు. మియన్మార్ సరిహద్దులో మనకు ఫెన్సింగ్ లేదని.. మిజోరాం, మణిపూర్‌లో కుకీలు శరణార్థులుగా వచ్చారన్నారు. వేల సంఖ్యలో కుకీలు రావడం మొదలైందని.. తాము పది కిలోమీటర్లు ఫెన్సింగ్ పూర్తి చేసినట్టు చెప్పారు. ఏడు కిలోమీటర్ల ఫెన్సింగ్ పని ప్రారంభమైందని.. 600 కిలోమీటర్ల ఫెన్సింగ్ సర్వే ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. 2014 వరకు ఫెన్సింగ్ లేదని.. లోయలో మెయితీలు నివసిస్తారన్నారు. కొండలపై కుకీలు, నాగా ట్రైబల్స్ నివసిస్తారని చెప్పారు. వాళ్ల సంఖ్య పెరుగుతూ ఉండడంతో మన సంఖ్య మైనార్టీలో పడిందన్నారు. దీంతో జనవరి నుంచి అక్కడ శరణార్థులకు గుర్తింపు కార్డు, థంబ్ ఇంప్రెసన్, ఐ ఇంప్రెసన్ తీసుకుని..ఓటర్ లిస్టు, ఆధార్ కార్డు నెగెటివ్ లిస్టులో పెట్టడం జరిగిందని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే: లోక్‌సభలో విపక్షల నేతలకు సమాధానం చెబుతూ 'ఐనప్పటికీ సంఖ్య పెరుగుతూ ఉండడంతో మైతీల్లో అభద్రతా భావం పెరిగిపోయింది. నేపాల్ పద్ధతిలోనే మయన్మార్‌కు పాస్‌పోర్టు అవసరం లేదు. 1968లో భారత్, బర్మా మధ్య ఒప్పందం జరిగింది. దీని ప్రకారం సరిహద్దు నుంచి 40 కిలోమీటర్ల వరకు పాస్‌పోర్టు అవసరం లేదు. దీంతో వారిని ఆపడం మన వల్ల కాదు. వేలాది కిలోమీటర్ల సరిహద్దుకు ఫెన్సింగ్ కూడా లేదు. వారి సంఖ్య పెరుగతూ పోయింది. అభద్రతా భావం పెరిగిపోయింది. ఏప్రిల్ నుంచి లోయలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఐతే ఏప్రిల్‌లో మణిపూర్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఉంతీస్ ఏప్రిల్ మైతీలకు రిజర్వేషన్ ఇచ్చేలా ప్రతిపాదన పంపాలని ఆదేశం ఇచ్చింది. దీంతో కొండ ప్రాంతాల్లో అల్లర్లకు కారణమైంది. మెయితీలు గిరిజనులు ఐతే మా ఉద్యోగాలు పోతాయన్న భావన వారిలో పెరిగింది. లోయలో అప్పటికే అల్లర్లు ప్రారంభమయ్యాయి. మూడో తేదిన ఓ ఘటన జరిగింది. అప్పటి నుంచి మణిపూర్‌లో అశాంతి నెలకొంది. మియన్మార్‌లో మిలిటరీ పాలన వచ్చాక..నార్కొటిక్స్ రవాణా కూడా పెరిగింది. ఇక్కడ రెండు ప్రశ్నలున్నాయి. హింస ప్రారంభమైన తర్వాత ఏం చేశారు. ఐతే దీనిపై తర్వాత చెప్తాను. నేను ఏ అంశం నుంచి పారిపోను. పారిపోవడం నా స్వభావం కాదు' అని అమిత్‌షా లోక్‌సభలో వ్యాఖ్యానించారు. అసలు కారణాలేంటి? మూడు నెలలుగా మణిపూర్‌లో జరుగుతున్న హింసలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది నిరాశ్రయులు కావడం.. దేశ ప్రజలను కలిచివేసింది. అసలు మణిపూర్ ఆవిర్భావం ఏమిటి.. ఈ హింసకు కారణం ఏమిటి.. ప్రభుత్వాలు ఎందుకు ఈ అల్లర్లను నియంత్రించలేకపోతున్నాయి. ఇటీవల కాలంలో మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారానికి పాల్పడడం వంటి సంఘటనలు సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడంతో.. ఇంత అనాగరికమైన పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయనే ఆవేదన, ఆశ్చర్యం దేశ ప్రజానీకంలో కనిపిస్తోంది. దేశంలో రాజకీయాల కారణంగా ఒక్కొక్కరు ఒక్కోలా మణిపూర్ సమస్యను విశ్లేషిస్తున్నారు. ఈ ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఏది కరెక్ట్.. ఏది రాంగ్ అనేది తెలియక దేశ ప్రజలు సతమతమవుతున్నారు. తెగల మధ్య ఏం జరిగింది? దేశంలో చాలా ప్రాంతాల్లో స్థానిక పరిస్థితుల కారణంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం, రెండు, మూడు రోజులు సద్దుమణగడం చూస్తూ ఉంటాం. కాని మణిపూర్ మంటలు మూడు నెలలైనా ఆరడం లేదు. మణిపూర్‌లో హింస చేలేగడానికి తక్షణ కారణాలు కొన్ని ఉండి ఉండొచ్చు. కాని దీర్ఘ కాలంగా హింస ఎందుకు కొనసాగుతుందనేది తెలుసుకోవాలంటే మణిపూర్ చరిత్రను తెలుసుకోవాలి. మణిపూర్ సమస్యను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ రాష్ట్రంలో తెగల గురించి తెలుసుకోవాలి. రాష్ట్రంలో అనేక రకాల తెగలు ఉండగా ప్రధానంగా మెయితి, నాగ, కుకి తెగల గురించి తెలుసుకోవాలి. ఈ తెగల మధ్య ఏర్పడిన విబేధాలే ఇప్పుడు రచ్చను రాజేశాయి. ఒక ప్రాంతం చరిత్రను నిర్దేశించేది అక్కడి భౌగోళిక పరిస్థితులే. మణిపూర్ చరిత్రను అర్థం చేసుకోవాలంటే ఆ ప్రాంత జాగ్రఫీ తెలుసుకోవాలి. మణిపూర్ దాదాపు 90శాతం కొండ ప్రాంతాలతో నిండి ఉంటుంది. కేవలం 10 శాతం మాత్రమే చదునైన నేల. మణిపూర్‌లోని మూడు ప్రధానమైన తెగలలో మెయితీ తెగ ప్రజలు చదునైన నేల కలిగిన లోయ ప్రాంతంలో నివసిస్తుంటారు. మిగిలిన 90 శాతం కొండ ప్రాంతాలలో నాగ, కుకి తెగల ప్రజలు నివసిస్తుంటారు. చరిత్ర తెలుసుకోవాల్సిందే: మెయితీ తెగ ప్రజలు చదునైన ప్రాంతంలో నివసించడం కారణంగా ఈ తెగ ప్రజలు విద్య, ఉద్యోగాలపరంగా మాత్రమే కాకుండా రాజకీయపరంగా కుకీలతో పోల్చుకుంటే ముందంజలో ఉంటారు. ఈ ఒక్క కారణంగా నాగ, కుకి తెగల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. మణిపూర్‌లో గిరిజన రిజర్వేషన్లు ఉండగా, మెయిటి తెగ ప్రజలకు గిరిజన హోదా లేదు. తమకు గిరిజన హోదా కావాలంటూ మెయిటీ తెగ ప్రజలు ఆందోళన చేస్తుండగా, వారికి గిరిజన హోదా ఇవ్వద్దని ఇతర తెగలవారు ఆందోళన బాటపట్టారు. ఈ రెండు ఆందోళనల నడుమ జరిగిన హింసాత్మక ఘటనలే మణిపూర్ లో ప్రస్తుత పరిస్థితులకు కారణమనే అభిప్రాయం వెలువడుతోంది. అన్ని రంగాల్లో ముందంజలో ఉండే మెయిటీ తెగ గిరిజన రిజర్వేషన్లను ఎందుకు అడుగుతుందనే తెలుసుకోవాలంటే.. మణిపూర్ చరిత్రను తెలుసుకోవాలి. మతపరమైన కారణాలతోనే ఈ గొడవలా? 1891 నుంచి బ్రిటిష్ పాలన లో ఉన్న భారత్.. 1947లో స్వతంత్య్రాన్ని సాధించింది. బ్రిటిష్ వాళ్లు ఏ రాజ కుటుంబం నుంచి 1891 లోఅధికారాన్ని హస్తగతం చేసుకున్నారో అదే కుటుంబానికి 1947 లో తిరిగి అధికారాన్ని ఇవ్వడంతో ఆ రాజు మణిపూర్ భారతదేశంలో కలవకుండా స్వతంత్ర దేశంగా పాలించడానికి మొగ్గు చూపారు. ఇది నచ్చని అప్పటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేక ప్రయత్నాల కారణంగా 19 49 లో మణిపూర్ భారత్ లో భాగమైంది. 1891 ముందు, 1949 తర్వాత రాజకీయ అధికారం మెయిటి తెగకు పరిమితమైంది. దీంతో ఇతర తెగల్లో మెయితీలపై వ్యతిరేకత ఏర్పడటానికి కారణమైంది. ప్రస్తుతం మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం ఉండగా.. ఈ ప్రభుత్వంలో అగ్రభాగం మెయితీ తెగకు చెందిన వాళ్లే. చదునైన ప్రాంతంలో నివసిస్తూ మిగతా తెగల కంటే అడ్వాన్స్ గా ఉండే మెయిటీ తెగ ప్రజల్లో మెజార్టీ హిందువులు. కొండ ప్రాంతాల్లో ఉండే నాగ తెగ ప్రజల్లో మెజార్టీ క్రిస్టియన్లు. కుకి తెగలో కొందరు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండగా.. మరికొందరు హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు. అలాగే కొంతమంది ప్రాంతీయ గిరిజన పద్ధతులను అవలంబిస్తున్నారు. ఇప్పటికే ఇతర కారణాలవల్ల ఉన్న వైరుధ్యాలకు తోడు మతపరమైన కారణాలు ఈ తెగల మధ్య మరింత అగ్గిని రాజేశాయి. ఉనికి కోసం: నాగ, కుకిలు ఉండే కొండ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా కట్టారంటూ ఇటీవల ఒక చర్చిని కూల్చివేయడంతో మత ఉద్రిక్తతలకు దారితీసింది. అప్పటినుంచి మెయితీలు, నాగ, కుకీల మధ్య ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. మరోవైపు నాగ, కుకీలతో పోలిస్తే కొంతమేర అభివృద్ధి చెందిన మెయిటి తెగ ప్రజలు గిరిజన హోదా కోరడం దశాబ్దాలుగా ఉన్న సమస్యకు మరింత ఆజ్యం పోసింది. మణిపూర్‌తో పాటు.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో బయటి వ్యక్తులు స్థలాల కొనుగోలుపై ప్రభుత్వం పరంగా ఆంక్షలు ఉంటాయి. గిరిజనులు ఇతర ప్రాంతాల్లో భూముల కొనుగోలుపై ఎటువంటి ఆక్షంలు లేవు. గిరిజనుల జీవనశైలి, అక్కడి పర్యావరణం బయటి వ్యక్తుల కారణంగా కలుషితం కాకుండా.. గిరిజనులు తమ ఉనికి కోల్పోకుండా.. ఉండేందుకు రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారు. 10 శాతం విస్తీర్ణంలో నేల ఉన్న తమ ప్రాంతం లోకి ఇతర తెగలవారు వచ్చి భూములు కొంటున్నారని, మిగతా 90 శాతం ప్రాంతం భూమిని తాము కొనలేక పోతున్నామని, అందుకే తమకు గిరిజన హోదా కావాలంటూ మెయిటి తెగ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇతర తెగల వారు పూర్తిగా అభివృద్ధి చెంది, రాజకీయ ఆధిపత్యం కలిగినప్పటికి.. వాళ్లకు గిరిజన హోదా ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అని, తమ ప్రాంతాల్లో భూములు కొనే అవకాశం కల్పిస్తే.. తమపై పెత్తనం చేస్తారంటూ నాగ, కుకీలు ఆందోళన చెందుతున్నారు. అదే జరిగితే తమ తెగలు ఉనికిని కోల్పోతాయని భయాందోళన చెందుతున్నారు నాగ, కుకీ తెగల ప్రజలు. మెయితీ, నాగ, కుకీల మధ్య ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఈ వివాదంపై ఇరు వర్గాలు న్యాయం కోసం కోర్టుకెళ్లాయి. ఈలోపు కోర్టు తీర్పు తమకు వ్యతిరేకంగా వస్తుందేమోననే భయంతో తెగల వారీగా ఆందోళనకు దిగాయి. ఈ ఆందోళనలు తీవ్రతరం కావడంతో హింస చెలరేగింది. కుకీ తెగకు చెందిన మహిళలను నగ్నంగా ఊరేగించి.. అత్యాచారం చేశారన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ వైపు రిజర్వేషన్ల గోడవ, మరోవైపపు హింసాత్మక ఘటనలతో మణిపూర్‌లో మంటలు చల్లారడం లేదు. మరోవైపు మణిపూర్ సరిహద్దు దేశాలైన మియన్మార్ తదితర ప్రాంతాల నుండి అక్రమంగా చొరబడుతున్న వలసదారులు కొండ ప్రాంతాలలోని నాగ, కుకీ తెగల తో కలిసిపోయి దేశ సమగ్రతకు భంగం కలిగేలా చేస్తున్నారనే ఆరోపణలు ఓ వర్గం నుంచి వినిపిస్తున్నాయి. కొండ ప్రాంతాల్లోని నాగ, కుకీ జాతులు గంజాయి పండిస్తున్నారని, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మెయిటి తెగ ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజకీయంగా బలహీనమైన తమ తెగల మీద అసత్య ప్రచారం చేస్తూ, తమను విద్రోహులుగా చూపిస్తున్నారని, తమ ఉనికిని ప్రశ్నార్థకం చేసే కుట్ర జరుగుతోందంటే నాగ, కుకీ తెగలు అంటున్నాయి. ప్రధానంగా రిజర్వేషన్లతో పాటు, అధిపత్యం సమస్య మణిపూర్‌లో మంటలు చెలరేగడానికి కారణంగా కొంతమంది విశ్లేషిస్తున్నారు. #amit-shah #2023-manipur-violence మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి