Amit Shah Warned Bandi and Etela: ఈ రోజు తెలంగాణలో పర్యటిస్తున్న హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లోని హోటల్ నోవాటెల్ లో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీలో నేతల మధ్య కోల్డ్‌వార్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందరు నేతల ముందే సీనియర్లకు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల సోషల్‌మీడియాలో బండి (Bandi Sanjay), ఈటల (Etela Rajender) వర్గం వార్ సాగిన విషయం తెలిసిందే. బండికి, ఈటలకు విబేధాలంటూ పార్టీతో పాటు రాజకీయవర్గాల్లో కొన్నాళ్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో పార్టీని ఈ విభేదాలే దెబ్బకొట్టాయన్న వాదన కూడా ఉంది.
ఈ నేపథ్యంలోనే సీనియర్లకు అమిత్ షా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడొద్దు, లీకులు ఇవ్వొద్దని అమిత్ షా నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇంకా సిట్టింగ్ ఎంపీలు అదే స్థానంలో పోటీ చేసేందుకు కూడా అమిత్ షా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. 4 సిట్టింగ్ స్థానాలు మినహా మిగతా లోక్‌సభ స్థానాలపై (Lok Sabha Elections) కూడా షా ఆరా తీసినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ నేతలకు అమిత్ షా సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
అయితే.. సిట్టింగ్ ఎంపీలు వారి సీట్లలోనే పోటీ చేయాలని అమిత్ షా చెప్పిన నేపథ్యంలో బండి సంజయ్ మరో సారి కరీంనగర్ నుంచే పోటీ చేయనున్నట్లు స్పష్టం అవుతోంది. పార్టీలోని కొందరు సీనియర్లు ఇటీవల సమావేశమై బండి సంజయ్ ను మార్చాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ప్రస్తుతం అమిత్ షా ఓకే చెప్పడంతో బండి సంజయ్ కు లైన్ క్లీయర్ అయినట్లు తెలుస్తోంది.