Telangana: అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం: అమిత్ షా

రానున్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ రోజు సూర్యాపేటలో జరిగిన బీజేపీ సభలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ ఇచ్చిన మాట తప్పదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మాటలు నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

New Update
Telangana: అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తాం: అమిత్ షా

ఈరోజు సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ జనగర్జన సభలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. బీజేపీ ఇచ్చిన మాట తప్పదని స్పష్టం చేశారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు. రూ.50వేల కోట్లతో దళితుల అభివృద్ధి నిధి ఏమైందో చెప్పాలంటూ ప్రశ్నించారు. రూ.10 వేల కోట్లతో బీసీ సంక్షేమ కార్యక్రమాలు అని చెప్పి వారి సంక్షేమాన్ని కేసీఆర్ ఎందుకు గాలికొదిలేశారంటూ నిలదీశారు. బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుటుంబ పార్టీలని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం సోనియా గాంధీ లక్ష్యమని.. అలాగే కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయడం కేసీఆర్ లక్ష్యమని వ్యాఖ్యానించారు.

Also Read: మరికాసేపట్లో తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. అభ్యర్థులు వీరేనా?!

ఇప్పటికే రాష్ట్రంలో లక్ష 90 వేల మందికి బీజేపీ సర్కార్ ఉచిత బియ్యం అందిస్తోందని అన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతీ రైతుకు ఏడాదికి ఆరువేల రూపాయల చొప్పున ఇస్తోందని పేర్కొన్నారు. మహిళా ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు ముప్పై లక్షల మరుగుదొడ్లు నిర్మించామని తెలిపారు. ఇటీవల తెలంగాణకు ప్రధాని మోదీ గిరిజన యూనివర్సిటీని కేటాయించారని అన్నారు. అలాగే రాష్ట్రంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఘనత కేవలం మోదీకే దక్కుతుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మి మోసపోవద్దని.. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని అమిత్ షా స్పష్టం చేశారు.

మరోవైపు దాదాపు 500 ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతోందని.. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలా? వద్దా? అని ప్రజలను అడిగారు. జనవరి 22న ప్రధాని మోదీ రామమందిరంలో పూజ చేయనున్నారని చెప్పారు. జనవరి చివరి వారంలో మీరంతా అయోధ్యకు రావాలని పిలుపునిచ్చారు. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని అమిత్ షా కోరారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు