Amit Shah On Delhi Ordinance Bill : ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు (DELHI ORDINANCE) రాజ్యాంగబద్ధమేనని హోమ్ మంత్రి అమిత్ షా (AMIT SHAW) ప్రకటించారు. ఈ బిల్లుపై పార్లమెంటులో చర్చించజాలమన్న విపక్షాల వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాలకు ఉద్దేశించినవని ఆయన వ్యాఖ్యానించారు. వివాదాస్పదమైన ఆర్డినెన్స్ స్థానే తెచ్చిన ఈ బిల్లును మొదట హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్మెంట్) బిల్లు-2023 పేరిట దీన్ని వ్యవహరిస్తున్నారు. ఈ బిల్లుపై సుదీర్ఘంగా మాట్లాడిన అమిత్ షా, ఢిల్లీకి సంబంధించినంతవరకు ఏ చట్టాన్నయినా సభ ఆమోదించేందుకు రాజ్యాంగం అధికారాన్ని ఇచ్చిందన్నారు. అలాగే హస్తినకు సంబంధించిన ఏ శాసనాన్నయినా పార్లమెంట్ కి తేవచ్చని సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్య చేసిందని గుర్తు చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాలకోసమే విపక్షాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయన్నారు. 249 అధికరణం కింద ఏ చట్టాన్నయినా తెచ్చేందుకు ఈ సభకు అధికారాలున్నాయని ఆయన చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ అధికారుల పోస్టింగులు, బదిలీల విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్ కే అధికారాలను కట్టబెట్టడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ నేతలు అధిర్ రంజన్ చౌదరి, శశిథరూర్, గౌరవ్ గొగోయ్, ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని అమిత్ షా అన్నారు. రూల్ 72 కింద అధిర్ రంజన్ చౌదరి ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, ఢిల్లీ ప్రభుత్వ అధికారాల్లో జోక్యం చేసుకునేందుకు, ప్రభుత్వ హక్కులను కాల రాచేందుకు ఈ బిల్లును తెచ్చారని ఆరోపించారు. అధికారుల సర్వీసులకు సంబంధించి అధికారాలు ఢిల్లీ ప్రభుత్వానికే ఉండాలన్నారు. ఆప్ తో సహా విపక్ష ఎంపీలు ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మణిపూర్ అంశంపై చర్చ జరగాలంటూ ప్రతిపక్ష సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేయడంతో లోక్ సభ రేపటికి వాయిదా పడింది. మొదట ఈ ఉదయం కూడా సభలో ఇలాగే రభస జరగడంతో స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా వేశారు. ఆ తరువాత సభ మళ్ళీ ప్రారంభం కాగానే ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ప్రభుత్వం ప్రతిపాదించింది.
రాజ్యసభలో విపక్షాల వాకౌట్
మణిపూర్ (MANIPUR) అంశంపై ప్రధాని మోడీ సభలో ప్రకటన చేయాలని రాజ్యసభలో విపక్ష కూటమి సభ్యులు మాటిమాటికీ డిమాండ్ చేస్తూ నినాదాలతో సభను హోరెత్తించారు. చైర్మన్ జగదీప్ ధన్ కర్ వీరి డిమాండును తిరస్కరించడంతో అందుకు నిరసన వ్యక్తం చేస్తూ వీరు సభ నుంచి వాకౌట్ చేశారు. ఒకవైపు సభ జరుగుతుండగానే మరోవైపు కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే (MALLIKHARJUNA KHARGE) బయట మీడియాతో మాట్లాడుతూ అతి ముఖ్యమైన మణిపూర్ పరిస్థితి గురించి ఉభయసభల్లో ప్రస్తావించేందుకు విపక్షాలను ప్రభుత్వం అనుమతించడం లేదని ఆరోపించారు. తాము ఇంతగా డిమాండ్ చేస్తున్నా మోడీ
మణిపూర్ అంశంపై సభలో ఎందుకు ప్రకటన చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును ఆప్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నదని ఖర్గే గుర్తు చేశారు. ఈ బిల్లుపై బుధవారం పార్లమెంటులో చర్చ జరిగే అవకాశాలున్నాయి. వివాదాస్పదమైన బిల్లులో ప్రభుత్వం మూడు అంశాలను తొలగించి ఒకదాన్ని కొత్తగా చేర్చింది.