Ambati Rayudu Comments On CM Jagan: ఏపీలో ఎన్నికల రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. రాజకీయ నేతల మధ్య మాటల యుద్దం పెరుగుతుండగా.. తాజాగా క్రికెట్ ను వదిలి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అంబటి రాయుడు కూడా ఇందులో చేరిపోయారు. తొలుత వైసీపీ (YCP) చేరి వారం రోజులకే బయటికి వచ్చి జనసేనలో (Janasena) చేరిన ఆయన.. ఇవాళ వైసీపీ, వైఎస్ జగన్ పై తీవ్ర స్ధాయిలో విమర్శలకు దిగారు. ముఖ్యంగా వైసీపీలో తాను ఎదుర్కొన్న అనుభవాలను గుర్తుచేసుకుంటూ ఆ పార్టీకి ఓటేస్తే ఏ జరుగుతుందో చెప్పేశారు.
వైసీపీలో బానిసత్వం తప్ప మరొకటి లేదని అంబటి రాయుడు విమర్శించారు.ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జగన్ కాలి కింద చెప్పులా బ్రతకాల్సిందేనన్నారు. ఒక ప్రాజెక్ట్ కట్టడం కానీ, ఒక పరిశ్రమను తీసుకుని రావడం కానీ చేయకుండా బటన్లు నొక్కడమే అధికారం అన్నట్లుగా జగన్ పరిపాలన చేస్తున్నాడన్నారు.ఇలాగే బటన్లు నొక్కుతూ రాష్ట్రానికి బొచ్చె ఇస్తాడని రాయుడు అన్నారు. సంక్షేమం ఒక్కటే పరిపాలన కాదని, సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేస్తేనే రాష్ట్రం అన్నిట్లో ముందుకు వెళ్తుందన్నారు. క్రీడారంగాన్ని సైతం నిర్వీర్యపరిచాడంటూ జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకోండని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల్లో సిక్స్ కొట్టండి. 6 వ నంబర్ పై నొక్కండంటూ కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఓటర్లను కోరారు.
Also Read: ఎన్నికల వేళ జనసేనకు ఈసీ బిగ్ షాక్
అవనిగడ్డ ఎన్డీయే అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ కి మద్దతుగా అవనిగడ్డ లో అంబటి రాయుడు ప్రచారం చేశారు. తాను క్రికెట్ అడుతూనే ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో రాష్ట్రమంతా 7 నెలల పాటు పర్యటించానని తెలిపారు. జగన్ తో కొంతకాలం ప్రయాణం చేశానన్నారు.కానీ వైసీపీలో కొనసాగితే ప్రజాసేవ చేయలేమని తెలుసుకున్నానన్నారు.
ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకు వెళ్తుంటే మన రాష్ట్రం మాత్రం వెనక్కు వెళ్ళిపోతుందన్నారు. ఇవన్నీ అనుభవంతో తెలుసుకున్నాన్నారు. కులమతాల బేధం లేకుండా అన్ని కులాల వారిని ఓకేత్రాటిపై తీసుకుని రావాలనే పవన్ కళ్యాణ్ ఆరాటం అన్నారు. పవన్ పోరాటం తనకు ఎంతగానో నచ్చిందని, కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టోలో ప్రతి అంశం అమలు అయ్యేలా పవన్ కళ్యాణ్ తప్పకుండా చూస్తారన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు, ప్రజల భవిష్యత్తుకు ముఖ్యమైన ఈ ఎన్నికలలో ప్రతి ఒక్కరూ కూడా సమర్ధవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని రాయుడు సూచించారు.