Ambati Rambabu on Chandrababu Bail: టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ఇస్తూ హైకోర్టు ఈరోజు తీర్పు వెల్లడించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. నవంబర్ 24 వరకు షరతులతో కూడిన బెయిల్ ను ఇచ్చింది. కేవలం ఆరోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. నవంబర్ 24న బాబు తిరిగి సరెండర్ కావాలని ఆదేశించింది. దాంతో పాటు బెయిల్ మీద బయటకు వెళ్లాక ఆస్పత్రికి వెళ్లడం మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొన కూడదని స్పష్టం చేసింది. ఫోన్‌లో కూడా మాట్లాడకూడదంటూ ఆదేశాల్లో పేర్కంది న్యాయస్థానం. అలాగే మీడియా, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. నవంబర్ 10న మెయిన్ బెయిల్ పిటిషన్‌పై వాదనలు వింటామని ఈ సందర్భంగా హైకోటర్లు తెలిపింది.
అయితే, కోర్టు తీర్పుపై వైసీపీ నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) వ్యంగ్యంగా స్పందించారు. టీడీపీ (TDP) నేతలు చెబుతున్నట్లు నిజం గెలిచింది కాబట్టి చంద్రబాబుకు బెయిల్ రాలేదని, చంద్రబాబుకు కళ్లు కనిపించడంలేదు కాబట్టి బెయిల్ వచ్చిందని ట్వీట్ చేశారు.
మరోవైపు టీడీపీ చేస్తున్న డ్రామాలను ప్రజలు పట్టించుకోవడం లేదని వైసీపీ (YSRCP) నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ పై టీడీపీ నేతలతో పాటు నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. మంత్రి ట్వీట్ కు కౌంటర్ గా ఎక్స్ (ట్విట్టర్) యూజర్లు కౌంటర్లు వేస్తూ కామెంట్లు పెడుతున్నారు.